Chandrababuవిభజన రీత్యా ఏర్పడిన రెవిన్యూ లోటు భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్న విషయం తెలిసిందే. దీనిని బిల్లులో కూడా పెట్టి చట్టం చేసారు. మరి అందుకు తగ్గట్లుగానే కేంద్రం రెవిన్యూ లోటు పూడుస్తోందా? అంటే ప్రతి సంవత్సరం ఏదొక కారణాలు చెప్తూ చంద్రబాబు సర్కార్ కు చుక్కలు చూపెడుతోంది. అసలు విషయం ఏమిటంటే… విభజన జరిగి మూడు సంవత్సరాలు గడిచినా, ఇంకా తొలి సంవత్సరానికి గానూ కేంద్రం చెల్లించాల్సిన రెవిన్యూ లోటును కూడా ఇవ్వకపోవడం.

తాజాగా రెవెన్యూ లోటు భర్తీపై రాష్ట్ర ప్ర‌భుత్వం చేసుకున్న‌ అభ్యర్థనపై కేంద్ర ప్ర‌భుత్వం స్పందిస్తూ… ఏపీ రెవెన్యూ లోటు కేవలం 4,117.89 కోట్లేనని విస్తుపోయే విషయాన్ని నింపాదిగా చెప్పింది. 2014-15 రెవెన్యూ లోటును ఏపీ ప్ర‌భుత్వం గతంలో 16 వేల కోట్లుగా తెలుపగా, ఆ లెక్క‌ల‌ను తాము ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోమ‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. రాష్ట్రానికి ఇప్పటికే 2,303 కోట్ల నిధులు మంజూరు చేసామని, ఏపీ కొత్త ప్రాజెక్టులకు ఖర్చు చేసిన మొత్తాన్ని లోటుగా పరిగణించలేమని తెలిపింది.

మరో హాస్యాస్పద విషయం ఏమిటంటే… కేంద్రం తేల్చిన నాలుగు వేల కోట్ల లెక్కలోనూ ఇప్పటికి సగం మాత్రమే చెల్లించినా, మిగతా సగం గురించి అసలు మాట్లాడకపోవడం! అది ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా రాష్ట్ర సర్కార్ కు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఉండడంతో రాష్ట్ర అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్ధిక కష్టాలతో సతమతమవుతున్న చంద్రబాబు సర్కార్ కు పూర్తిగా సహకరిస్తున్నాము అంటూనే, ఇలా కోతలు విధిస్తూ మోడీ సర్కార్ చుక్కలు చూపిస్తోంది.