Andhra_Pradesh_Governmentఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉర్దూ భాషను రెండో అధికార భాషగా గుర్తిస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ-2022 ప్రకారం ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వచ్చాయని కనుక అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ మేరకు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని జీవోలో ఆదేశించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాలలోనే ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలనే తీర్మానానికి ఆమోదం తెలిపింది.

ఏపీతో పోలిస్తే తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కనుక తెలంగాణ ప్రభుత్వం ఉర్దూను రెండో అధికారభాషగా గుర్తించింది. తెలంగాణలో గత ఏడాది గణాంకాల ప్రకారం 12.8 శాతం ముస్లిం జనాభా ఉండగా ఏపీలో 9.56 శాతం ఉంది.

రాష్ట్రంలో మైనార్టీలు, ఉర్దూ భాష ప్రేమికుల అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ముస్లిం ఓటర్లను ఆకట్టుకొనేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాష్ట్రంలో బిజెపి బలపడే ప్రయత్నాలు చేస్తోందని గ్రహించి నందునే ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి జగన్ ప్రభుత్వం ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను వివిద కులాలు, వర్గాలుగా విడదీసి సంక్షేమ పధకాలు అందజేస్తోంది. అందుకు ప్రతిగా వచ్చే ఎన్నికలలో తమ పార్టీకే ఓట్లు వేయాలని గడపగడపకు వెళ్ళి వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. అలాగే తమ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా ప్రాధాన్యం ఇస్తుందని నిరూపించేందుకు ఆయా వర్గాల మంత్రులతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేయించారు. తెలంగాణ నుంచి ఆర్.కృష్ణయ్యను రప్పించి బీసీ కోటాలో రాజ్యసభ సీటు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకొనేందుకు కోనసీమకు డాక్టర్ అంబేడ్కర్ పేరు జోడించారు.

దమ్మిడీ ఆదాయం లేనప్పుడు సంక్షేమ పధకాలు తలకు మించిన భారమే అయినప్పటికీ అప్పులు చేసి మరీ అమలుచేస్తోంది వైసీపీ ప్రభుత్వం. అయినా ఇంకా వైసీపీ అధినేతలో చాలా అభద్రతాభావం నెలకొని ఉందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. కనుక మిగిలిన ఈ రెండేళ్ళలో ఇంకా ఎన్ని ఓటు బ్యాంకు నిర్ణయాలు వెలువడతాయో చూడాలి.