reliance-iioఎన్నికల ఓటింగ్ కేంద్రంగా రాజకీయాలలో ‘ఫ్రీ’ అన్న పదం రాజ్యమేలుతుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా… ముందుగా అందరి చూపులు ‘ఎవరు ఎక్కువ ఉచిత పధకాలను ప్రకటించారు?’ అన్న అంశం పైనే. సంక్షేమం పేరుతో ‘ఫ్రీ’ పధకాలు అన్ని రాష్ట్రాలలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ఇది కాస్త ఎక్కువ ఉందన్న విషయం పలు సర్వేలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ఉచిత కరెంట్, రుణమాఫీ’ వంటి ఫ్రీ పధకాలతో అందలం ఎక్కారు.

ఇక రెండవ సారి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి కారణమైన ప్రధానమైన అంశాలు… ఉచిత విద్య, ఉచిత వైద్యం. మొన్నటికి మొన్న చంద్రబాబు అధికారంలోకి రావడం వెనుక కూడా అనేక ఉచిత పధకాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ‘ఆల్ ఫ్రీ బాబు’ అన్న నామకరణం కూడా ప్రత్యర్ధి వర్గాలు పెట్టారంటే… ఫ్రీ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ సారైనా ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని భావిస్తున్న వైసీపీ అధినేత కూడా తాజాగా బోలెడు ఫ్రీ పధకాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

‘ఫ్రీ’ అంటే ఏపీ ప్రజలు ‘ఫిదా’ అయిపోతారా? చరిత్ర అయితే ఇదే నిజమని చెప్తుండగా, మరో పక్కన ‘ఫ్రీ కాలింగ్, ఫ్రీ ఇంటర్నెట్’ వంటి సదుపాయాలతో టెలికాం మార్కెట్ లోకి దిగిన జియోను ఏపీ ప్రజలు ఆదరించినంతగా మరో రాష్ట్రం ఆదరించలేదని గణాంకాలు చెప్తున్నాయి. ఏపీలో ఉన్న దాదాపు 5.30 కోట్ల జనాభాలో 1.06 కోట్ల మంది జియోను వినియోగిస్తూ దేశంలో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ 90.1 లక్షలు, తమిళనాడు 90 లక్షలు, ఢిల్లీ 80.4 లక్షలు, ముంబై 50.6 లక్షలతో టాప్ 5లో ఉన్నాయని లేటెస్ట్ న్యూస్.

మరో విశేషం ఏమిటంటే… జియో వినియోగిస్తున్న టాప్ 3 రాష్ట్రాలలో రెండు దక్షిణాదికి చెందినవే కావడం. ఈ మూడు రాష్ట్రాలలో కూడా ఏపీలోనే తక్కువ జనాభా కలిగి ఉండడం మరో ట్విస్ట్. అయితే ఈ విశ్లేషణల ద్వారా వ్యక్తమవుతున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే… ‘ఫ్రీ’ అంటే ఏపీ ‘జనం’ పడిచస్తారన్న భావనలు వినపడుతున్నాయి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కనిపించే ఏపీకి చెందిన ప్రజానీకం మాత్రం… “అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో తాము అందరి కంటే ముందు ఉంటామని” చెప్తున్నారు. ఇది కాదనలేం మరి..!