Andhra-Pradesh-Special-Status-Communist-Partyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ వరంగా మారాల్సిన ప్రత్యేక హోదా ఓ రాజకీయ చదరంగా మారిందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షా పార్టీలన్నీ దానిని పూర్తిగా మరిచిపోయినా ప్రత్యేకహోదా సాధన సమితి, వామపక్షాలు కలిసి నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తున్నాయి.

అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది?అంటే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోతుందని యూపీయే ప్రభుత్వం గుర్తించినందునే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ ఏపీకి ఇస్తే దేశంలో చాలా రాష్ట్రాలకు ఈయాల్సివస్తుందనే కుంటిసాకుతో ఆ హామీని మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బిజెపి పెద్దలు ప్రత్యేక హోదా అంశం గడిచిపోయిన చరిత్ర అరిగిపోయిన రికార్డు అంటూ ఎద్దేవా కూడా చేశారు. దానికి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే గత టిడిపి ప్రభుత్వం అదే మహాప్రసాదం అని స్వీకరించింది. శాసనసభలో అభినందన తీర్మానాలు చేసి బిజెపి నేతలకు సన్మానాలు కూడా చేసింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినప్పటికీ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అదే బిజెపితో నేటికీ అంటకాగుతున్నారు. ప్రత్యేక హోదా విలువను, దాని వలన రాష్ట్రానికి కలిగే లాభాలను గుర్తించకుండా అదో ‘పాచిపోయిన లడ్డూ’ అంటూ తేలికగా కొట్టిపడేశారు.

ప్రత్యేక హోదా లభించకపోతే రాష్ట్రం, భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్టపోతాయంటూ ఇప్పటి సిఎం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు చేశారు. తమ పార్టీని గెలిపిస్తే మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని నమ్మబలికారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయనే మోడీ ముందు తలదించుకొని కాలక్షేపం చేసేస్తున్నారు.

కనుక తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బిజెపిల మొదలు రాష్ట్రంలో టిడిపి, వైసీపీల వరకు అన్నీ ఈ అంశాన్ని రాజకీయ కోణంలో నుంచే చూస్తూ రాజకీయ చదరంగం ఆడుకొన్నాయి తప్ప ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి, ప్రజలకు కలిగే లాభం గురించి ఆలోచించలేదనే చెప్పాలి.

ఎందుకంటే, మన రాజకీయ పార్టీలకి, వాటి నేతలకి ప్రత్యేక హోదాపై కంటే తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకోవడం వలననే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈవిదంగా మోసపోయారని చెప్పవచ్చు. కనుక మన బంగారం మంచిదికానప్పుడు ఎవరినో నిందించి ఏం ప్రయోజనం?అని సరిపెట్టుకోవలసిందే!