Andhra Pradesh - Special Statusరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ దక్కాల్సిన ‘ప్రత్యేక హోదా’పై తొలి రెండేళ్ళు కాస్త గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత కొన్ని సాంకేతిక కారణాల వలన అది ఏపీకి దక్కే విషయం కాదని, ప్రత్యేక ప్యాకేజ్ కు సై అన్నది తెలిసిందే. కేంద్రం స్టైల్లో చెప్పాలంటే… ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం. అది ఒక్క ఏపీకే కాదు, దేశంలో ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ అనుభవిస్తున్న ఇతర రాష్ట్రాలకు కూడా దూరం కానుందని కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు.

ఇలాంటి స్పష్టమైన, ఖచ్చితమైన సమాచారంతో ‘స్పెషల్ స్టేటస్’ విషయంపై ఏపీ జనాలకు కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. తొలి రెండేళ్ళ పాటు ఎంతో కొంత ఆశ ఉన్న మాట వాస్తవమే గానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తున్న జనాలు, ప్రత్యేక హోదా అన్న మాటను దాదాపుగా చెరిపివేసారు. కానీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం, ఇప్పటికీ ఈ స్పెషల్ స్టేటస్ అంశాన్ని తన రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటున్నారు.

అయితే ఈ ఉగాది సందర్భంగా ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. ప్రముఖ పండితులు రామచంద శాస్త్రి చెప్పిన ప్రకారం… ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ వచ్చి తీరుతుందంటా! అంతేకాదు ఈ క్రెడిట్ అంతా ఒక్క జగన్ మోహన్ రెడ్డికే సొంతమవుతుందంటా! దాంతో జగన్ ముఖ్యమంత్రి అవుతారంటా! ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చెప్పిన సదరు పండితులు గారు చేసిన ఈ వ్యాఖ్యలు, పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

జగన్ సిఎం అవుతారని చెప్పడం సంచలన విషయమేమీ కాదు గానీ, ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తుందని చెప్పడం మాత్రం సంచలనమే. పంచాంగం తదితర అంశాలపై ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం ఉంటుంది, అందులో తప్పు లేదు. అలాగే పంచాంగాలు చెప్పే వారు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. అయితే సాధారణంగా ఉగాది నుండి ఉగాది వరకు పంచాంగ శ్రవణాలు వినిపిస్తుంటారు, చదువుతుంటారు. కానీ, ఇక్కడేమో ఏకంగా 2018ని లేపేసి, 2019లో జగన్ సిఎం అయిపోతారని చెప్పడం ఎలా సాధ్యమైందో అగమ్యగోచరం.

బహుశా వచ్చే ఉగాదిని ముందుగానే సదరు పండితులు తమ దివ్య దృష్టితో చూసేసారేమో… అందుకే 2019 పంచాంగం కూడా చదివేసినట్లున్నారు… అన్న పంచ్ లు, సెటైర్లకు కొదవలేదు. నిజంగా ఆయన చెప్పినట్లు జగన్ సిఎం అయితే రాష్ట్రానికి ఏం జరుగుతుందో తెలియదు గానీ, ప్రత్యేక హోదా వస్తే మాత్రం జగన్ కంటే ఎక్కువగా ఈ పండితులు ఫుల్ ఫేమస్ అయిపోతారని చెప్పడంలో సందేహం లేదు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా లభిస్తుందన్న ఆశ లేదు. ఎన్నో వింటున్నాం… అందులో ఇది కూడా ఒకటి అనుకోవాలంతే..!