Andhra-Pradesh-Speaker-Tammineni-Sitaramఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, తమ్మినేని సీతారాం అదరగొట్టారు. సెప్టెంబరు 22 నుంచి 29వరకు యుగాండాలో జరగబోయే 64వ కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో మాట్లాడాల్సి అంశాలపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం అనైతిక చర్యగా ఆయన అభివర్ణించారు.

“ఇటీవల నలుగురు రాజ్యసభ సభ్యులు అధికార పార్టీలోకి ఫిరాయించారు. వెళ్తున్న సమయంలో పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. కొన్ని నైతికతలు పాటించాలి’ అన్నారు. ఆ ఫిరాయింపులకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. టీడీపీని మొత్తం విలీనం చేశారా? మనం దారులు వెతుక్కుంటే చాలా ఉన్నాయి. ఈ సర్దుబాటుపై తర్వాత మాట్లాడతా. కానీ ఇది అనైతికం. నేను దీన్ని వివాదాస్పాదం చేయాలనుకోవడం లేదు” అని ఆయన చెప్పుకొచ్చారు.

అదే సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఫిరాయింపుల గురించి కూడా ప్రస్తావించి, స్నేహపూర్వకంగా మెలుగుతున్న తెలంగాణాలో జరిగిన, జరుగుతున్న ఫిరాయింపుల గురించి తమ్మినేని మాట్లాడకపోయినా, ప్రస్తావించిన వాటి మేరకు ఆయనను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. అది కూడా ఢిల్లీలో కేంద్రంలోని అధికారపార్టీకి వ్యతిరేకంగా. ఇదే వైఖరి వచ్చే ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిస్తే రాజ్యాంగ స్ఫూర్తికి మంచిదే.