Andhra-Pradesh-Speaker Tammineni Sitaram assurance to tdpఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒకరకంగా టీడీపీ నెత్తిన పాలు పోసినట్టు అయ్యింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహించనని ఎవరైనా అలా జరిగితే వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ని కోరారు. దీనిబట్టే తమ్మినేని వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తానని, గతంలో జరిగిన తప్పులు జరగనివ్వను అని హామీ ఇచ్చారు.

బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీని విలీనం చేసుకుంటాదని వార్తలు వస్తున్న తరుణంలో తమ్మినేని ఆ విషయం మీద కూడా స్పందించారు. “పార్టీ విలీన వ్యవహారాల్లో నేను అసలు రాజీ పడను. చట్టం ప్రకారం అది నేరం.. నిబంధనలకు విరుద్ధంగా నేను నడుచుకోను,” అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎవరైనా టీడీపీ నాయకులు పార్టీ మారితే వారి శాసనసభ సభ్యత్వం రద్దు అయినట్టే. లేకపోతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాల్సిందే.

ఎన్నికలు బాగా ప్రియం అయిపోయిన తరుణంలో ఎవరైనా ఉపఎన్నికలు కోరుకునే అవకాశం లేదు. దీనితో టీడీపీ నుండి వలసలు తాత్కాలికంగా ఆగిపోయినట్టే. దీనితో ఈ విషయంలో తమ్మినేని టీడీపీ నెత్తిన పాలు పోసినట్టు అయ్యింది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ నామమాత్రంగా 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. పీఏసి చైర్మన్ పదవి ఇవ్వనందున గంటా శ్రీనివాసరావు పార్టీలో చీలిక తెచ్చి బీజేపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతుంది.