Andhra Pradesh Secretariatఈ నెల 20 నుండి విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ కు ఆంధ్రప్రదేశ్ సచివాలయం మారుతుందని వార్తలు వస్తున్న క్రమంలో సచివాలయ ఉద్యోగులు కూడా బయటకు వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. రాజధాని తరలింపుపై సచివాలయం ముందు పబ్లిక్ పార్క్‌లో ఉద్యోగుల సమావేశమయ్యారు. విశాఖకు సచివాలయం తరలింపు నిర్ణయంపై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తమ సంఘాల నేతలతో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తూ రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ వారికి నచ్చ చెప్పబోయిన అప్స అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పై వారు నిరసన వ్యక్తం చేసారు. నేతల వ్యాఖ్యలతో ఉద్యోగులు అర్ధాంతంరంగా బయటకు వచ్చేశారు.

ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ … రాజధాని మార్పుపై కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతిలో రుణాలు తీసుకుని ఇళ్లు కొనుక్కున్నామని, మరో ప్రభుత్వం వస్తే విశాఖ నుంచి రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని, రాజకీయపార్టీల మధ్య గొడవలకు మమ్మల్ని బలిచేయొద్దని ఉద్యోగులు వేడుకుంటున్నారు.

ఉద్యోగుల అభిప్రాయాన్ని కమిటీలు తెలుసుకోలేదని వారు చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు విశాఖ వెళ్లాలంటే ఉద్యోగులకు తిప్పలు తప్పవని ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే పోరాటం తప్పదని వారు అంటున్నారు.