తెలంగాణ కొత్త సచివాలయం శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తెలంగాణ సెక్రటేరియట్ ఉన్న ప్రదేశంలోనే కొత్త సచివాలయం వస్తుంది. ఈ నెల 27న కొత్త భవనాలకు శంకుస్థాపన జరగబోతుంది. మరోవైపు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాలు వారంలోగా తెలంగాణకు అప్పగించనున్నారు. సోమవారం నుంచి భవనాల్లోని సామగ్రి, కంప్యూటర్లు, దస్త్రాల తరలింపు ప్రారంభమైంది. మూడు, నాలుగు రోజుల్లో పూర్తి అవుతుంది.
ఏపీ సచివాలయం వినియోగించిన భవనాలను తెలంగాణ సాధారణ పరిపాలన శాఖకు, శాసనసభ భవనాలను తెలంగాణ శాసనసభా కార్యదర్శికి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, మంత్రుల గృహ సముదాయాలను రోడ్లు భవనాల శాఖ ఎస్టేట్ అధికారికి అప్పగించనున్నారు. ఏపీ ప్రభుత్వం వాడిన భవనాలపై రూ. 14.5 కోట్ల మేరకు ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బకాయిలు ఉన్నాయి. వీటి రద్దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది అయితే దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కొత్త సచివాలయం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కల. దానిని ఇప్పటిదాకా ఏపీ భవనాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు. అయితే ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పడక ముందే భవనాలు ఇవ్వాలని నిర్ణయం తీసేసుకున్నారు. మొదటి కేబినెట్ భేటీ జరగకముందే భవనాల్లోని సామగ్రి, కంప్యూటర్లు, దస్త్రాల తరలింపు ప్రారంభమైంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని ఖాళీ చేస్తున్నంత వేగంగా భవనాల మీద బకాయిలు రద్దుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.