రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చాలా విభిన్నంగా సాగుతున్నాయి. తెలంగాణలో అభివృద్ధి జరిగిన తర్వాత కూడా టిఆర్ఎస్ అస్తిత్వం ప్రమాదంలో ఉంటే, ఏపీలో ఏ అభివృద్ధి జరుగకపోయినా మా పార్టీకి తిరుగులేదని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం.
టిఆర్ఎస్, వైసీపీ, బిజెపిలను మాత్రమే పరిగణలోకి తీసుకొని చూస్తే చాలా బలమైన నాయకత్వం, మంచి ప్రజాధారణ ఉన్న మంత్రులు, నాయకులు అనేకమంది ఉన్న టిఆర్ఎస్‌ను ఓడించి ఈసారి రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి రాగలమని బిజెపి గట్టి నమ్మకంతో పనిచేస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిధుల కోసం, అప్పుల కోసం, కేసుల కోసం కేంద్రం దయాదాక్షిణ్యలపై ఆధారపడి ఉన్నప్పటికీ ఏపీలో అధికారంలోకి రాలేమని బిజెపి భావిస్తుండటం విశేషం.
Also Read – అధికారం కోసం చిచ్చు పెట్టడం నైతికమేనా… ఏ-1, ఏ-2?
తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపి, అనేక సంక్షేమ పధకాలను కూడా అమలుచేస్తున్నందున కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడేందుకు బిజెపి వద్ద అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన అనే రెండు అస్త్రాలు తప్ప పెద్దగా అస్త్రశస్త్రాలు లేవు. అయినా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వాటితోనే కేసీఆర్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తూ, రాష్ట్రంలో బిజెపి తప్పకుండా అధికారంలోకి రాగలదనే నమ్మకం కలిగించగలిగారు.
ఏపీలో అమరావతి, మూడు రాజధానులు, అప్పులు, నిధుల మళ్లింపు, రోడ్లు మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు, నిరుద్యోగం, వైసీపీ నేతల అవినీతి, అరాచకాలు వంటి ఇంకా అనేకానేక అస్త్రశస్త్రాలున్నా రాష్ట్రంలో అసలు బిజెపి అనే ఓ పార్టీ ఉందో లేదో అన్నట్లుంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పుడప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీని, టిడిపిని విమర్శించడంతో ‘పని’ పూర్తయినట్లు భావిస్తుంటారు.
Also Read – మార్పు ‘ఉనికి’ని ప్రశ్నిచకూడదుగా..?
ప్రధాని నరేంద్రమోడీ మొదలు కేంద్రమంత్రులెవరికీ కేసీఆర్ సర్కార్ ఇప్పుడు స్వాగతం, వీడ్కోలు పలికే ప్రోటోకాల్ మానేయడమే కాక వారు వచ్చినప్పుడల్లా వారిని ఆక్షేపిస్తూ నగరంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లు కూడా పెట్టిస్తున్నారు. అదే… ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు ఏపీకి వస్తే జగన్ సర్కార్ వారికి ఘనంగా స్వాగతం పలికి రాచమర్యాదలు చేసి పంపిస్తుంటుంది. అయినప్పటికీ వారు తెలంగాణ రాష్ట్రంలోనే తరచూ పర్యటిస్తున్నారు తప్ప ఏపీవైపు కన్నెత్తి చూడటం లేదు!
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంత పూర్తి భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉండటం విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ దేశంలో ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకొంటున్న బిజెపి ప్రస్తుతం తెలంగాణ మీదే ఫోకస్ పెట్టినప్పటికీ దాని తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వంతే అని చెప్పవచ్చు.
Also Read – మనోజ్ ‘మంచు’ ని కరిగిస్తారా.? కాపాడతారా.?
కానీ వైసీపీ నేతలు ఈ విషయం తెలియనట్లు మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని గొప్పలు చెప్పుకొంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కేంద్రంలో మళ్ళీ బిజెపి వచ్చినా, లేదా తెలంగాణలో బిజెపి అధికారం చేజిక్కించుకొన్నా తర్వాత ఏపీ మీదే దృష్టి పెట్టడం ఖాయం. కనుక ఏపీలో అన్ని పార్టీలకు మరో 5 ఏళ్ళు గడువు మాత్రమే ఉందని భావించవచ్చు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు టిడిపి, వైసీపీ, జనసేనలు వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేసుకోక తప్పదు. తర్వాత సంగటి తర్వాత చూసుకోవచ్చు.