Andhra_Pradesh_Ploice_Clarifies_On_GO_1ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్: 1పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతుండటంతో రాష్ట్ర అదనపు డిజిపి (శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యనార్ నిన్న మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరణ ఇచ్చారు.

“రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవడంపై జీవోలో ఎటువంటి నిషేదమూ విధించలేదు. అసలు ఆ జీవోలో నిషేదం అనే పదం ఎక్కడా లేదు. అయితే వాటి కోసం ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకొని, వారు సూచించిన షరతుల ప్రకారం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనకి అనుమతి తీసుకొన్నవారు షరతులు పాటించలేదు. అదే విషయం పలమనేరు డీఎస్పీ లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఒకవేళ వారు షరతుల ప్రకారం కుప్పంలో పర్యటన నిర్వహించుకొని ఉంటే పోలీసులు కలుగజేసుకొనేవారే కారు.

ప్రతిపక్షాల సభలు, సమావేశాలు అడ్డుకోవడం కోసమే ఈ జీవో తెచ్చిందనే ఆరోపణలు సరికాదు. ఈ జీవో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకు సమానంగా వర్తిస్తుంది. కనుక వారు సభలు, ర్యాలీలు నిర్వహించుకొనేందుకు ఎటువంటి షరతులు పాటించాలో ఓ ప్రోఫార్మా తయారుచేసి అన్ని జిల్లాలకి పంపిస్తాము. నిర్వాహకులు సభలకి అనుమతి కోరుతూ దరఖాస్తుని సమర్పించినప్పుడు పోలీసులు వారికి ఆ ప్రొఫార్మాని అందజేస్తారు. దానిలో పేర్కొన్న షరతుల ప్రకారం వారు సభలు, ర్యాలీలు నిర్వహించుకొంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు.

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకి కూడా ఇదే వర్తిస్తుంది. ఆయన తరపు ఆయా జిల్లాలలో నిర్వాహకులు పాదయాత్రకి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకొంటే, ఆయా జిల్లాలలో పోలీస్ యంత్రాంగం స్థానిక పరిస్థితులని బట్టి తగిన నిర్ణయం తీసుకొంటుంది.

కందుకూరు ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని భావించడం లేదు. ఆ ఘటనపై ప్రభుత్వం న్యాయవిచారణకి ఆదేశించింది. దానిలో నిజానిజాలు తెలుస్తాయి. కందుకూరు ఘటన నేపధ్యంలో ప్రజల భద్రత కోసమే పోలీస్ చట్టంలోని సెక్షన్స్ 30,30ఏ, 31లను పునర్నిర్వచించేందుకు జీవోని జారీ చేయాల్సివచ్చింది,” అని రాష్ట్ర అదనపు డిజిపి (శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యనార్ తెలియజేశారు.