Meil Megha Engineering And Infrastructure Ltd Meil Megha Engineering And Infrastructure Ltdబహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కదలడం లేదు. ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, అవినీతి వెలికితీత పేరుతో ప్రభుత్వం పనులు ఆపివేసింది. పాత కాంట్రాక్టర్ నవయుగను తప్పించడంతో కోర్టు కేసులు కూడా వచ్చి పడ్డాయి. ఇది ఇలా ఉండగా గత అక్టోబర్ 21 నుంచి అంగుళం కూడా ముందుకు కదల్లేదు.

ప్రాజెక్టు కొత్త కాంట్రాక్టర్ చేతికొచ్చి 15 రోజులైంది. ప్రధాన పనులు, ఎడమ కాలువపై వంతెన పనులు, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రియంబర్స్‌మెంట్ నిధులు వస్తే తప్ప ముందుకు కదలే అవకాశం కనిపించడం లేదు. పాత కాంట్రాక్టర్ పనులు చేసిన కార్మికులకు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో వారు కూడా అక్కడ నిరసనలు తెలుపుతున్నారు.

ఇప్పటి వరకు పరిశీలిస్తే మొత్తం ప్రాజెక్టు 67.09 శాతం పూర్తయింది. 2021 మధ్య నాటికి కొత్త కాంట్రాక్టర్ ప్రాజెక్టుని పూర్తి చెయ్యాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాలను బట్టి అది సాధ్యం కాదనే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొత్త సంస్థ నిర్ధేశిత లక్ష్యం అందుకోవాలంటే పనులు యుద్ధ ప్రాతిపదికన ఊపందుకోవాల్సి ఉంది.

మరోవైపు జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి వెలికితీత పనులు అడ్డం పెట్టుకుని కేంద్రం నిధులు కూడా ఆపేసింది. ఒకవేళ కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం సొంత డబ్బు ఖర్చు చేసే అవకాశాలు లేవు. ప్రభుత్వ ప్రాధాన్యతలు నవరత్నాలు మాత్రమే అని ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్పుకొచ్చారు.