Nara-Lokesh - TDPఆకాశమే హద్దుగా నారా లోకేష్ అధికార పార్టీపై విమర్శలతో చెలరేగిపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రులు మాట్లాడే భాష చూస్తేనే జగన్ కు ఉన్న ‘విలువలు – విశ్వసనీయత’ ఏ పాటివో యావత్ రాష్ట్ర ప్రజలకు అర్ధమవుతుందన్నారు. సొంత కుటుంబ సభ్యులైన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను నమ్మించి నట్టేట ముంచిన మహానుభావుడు., తన బాబాయ్ హత్య నిందితులను కాపాడుతున్న కాలకేయుడు ఈ జగన్ రెడ్డి అంటూ లోకేష్ విమర్శల జల్లు కురిపించారు.

వైసీపీ ప్రభుత్వం అంటేనే విధ్వంసాల ప్రభుత్వం, “వినాశనం – విధ్వంసం” తప్ప మరే విషయాలలో కూడా కనీస అవగాహన లేని నేతలు వైసీపీ సొంతం. ‘పగ – ప్రతీకారం,’ ‘కక్ష్యలు – కార్పణ్యాలే’ వైసీపీ పెట్టుబడులు. ఇదే వైఖరిని మా నాయకుడు చంద్రన్న అనుసరించి ఉండుంటే ఈ జగన్ రెడ్డి తన ప్యాలస్ గేటు కూడా దాటేవారేనా? అంటూ వైసీపీ నాయకులను ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 5 లక్షల 40వేల ఉద్యోగాలు వచ్చాయని ఒక సందర్భంలో మీ దివంగత ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు, అది చంద్రబాబు విజనరీ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో ఆర్ధిక అస్థిరత ఏర్పడింది. “అప్పులలో ఆంధ్ర” ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అని జగన్ పాలన తీరుని లోకేష్ ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ మూడు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసారు. తన ప్రభుత్వ హయం ముగిసే నాటికి 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారంటూ లోకేష్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇలా అయితే రాష్ట్రంలో ఒక్కో తలకు 2లక్షల అప్పుకి భాద్యులవుతారు. అప్పులు పెరిగితే పన్నుల భారం పెరుగుతుంది.

ఇదే పరిస్థితులు కొనసాగితే ఈ రాష్ట్రంలో ప్రజలు తాము సంపాదించిన మొత్తంలో సగ భాగం పన్నులు కట్టుకోవడానికి సరిపోతుందన్నారు. ‘సమయం లేదు మిత్రమా!’ రానున్న రెండేళ్లలో టీడీపీని పటిష్ట పరిచి తిరిగి అధికారంలోకి తెచ్చే భాద్యత మీదే తమ్ముళ్లు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో జగన్ విధ్వంసాలు ఇంకా సాగనివ్వబోమని ప్రజలలో భరోసా కల్పించారు.

ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికలలో ఓటు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్ధించారు. ఈ రాష్ట్రానికి ప్రిజనరీ చరిత్ర ఉన్న నాయకుడు కావాలో., తన విజనరీతో చరిత్రలో నిలిచిన నాయకుడు కావాలో మీరే ఆలోచించుకోవాలంటూ లోకేష్ బంతిని ప్రజల ముందే ఉంచారు.