Andhra Pradesh people feel humiliated - Galla Jayadevగుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా నిన్న పార్లమెంట్ లో అదరగొట్టారు. అంకెలు, ఆధారాలతో సహా జయదేవ్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆయన ఒకింత ఘాటుగానే ప్రసంగించారు. బీజేపీ ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేస్తుందని, మిత్రధర్మం విస్మరిస్తోందని, వైకాపాతో పొత్తు కోసం అరులు చాస్తుందని ఆరోపించారు.

“మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌! సభా వేదిక నుంచి డిమాండ్‌ చేస్తున్నా! విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పండి! సమగ్ర వివరణ ఇవ్వండి! లేదంటే… మీరు ఏపీ పట్ల దురుద్దేశంతో ఉన్నారని భావించక తప్పదు. మేం ఇంకా మీతో బంధం ఎందుకు కొనసాగించాలనే విషయంపై పునరాలోచించక తప్పదు’’ అని అన్నారు జయదేవ్.

ఒక మొదటిసారి ఎంపీ పొత్తుల గురించి మాట్లాడడంతో అందరు ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అనుమతి లేకుండా ఇంతటి ఘాటైన ప్రసంగం ఖచ్చితంగా ఆయన చెయ్యరని, దీనిబట్టి చంద్రబాబు తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పారని అంతా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నేడు కూడా ఎంపీలు పార్లమెంట్ లో తమ నిరసన కొనసాగిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం రేపు ముగియనున్న బడ్జెట్ సమావేశాల లోపు కేంద్రం నుండి కచ్చితమైన హామీ రాకపోతే, సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ నుండి రాగానే బీజేపీ మైత్రి విషయంలో కఠిన నిర్ణయం తప్పదని తెలుస్తుంది. ఇదే విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలిపినట్టు కూడా తెలుస్తుంది.