andhra-pradesh-new-governer-vishwabhushan-harichandan-temperory-raj-bhavanకేంద్రం ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వేరువేరుగా గవర్నర్లను నియమించినట్టు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ కు విభజన అనంతరం రాజభవన్ లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. సూర్యారావుపేటలోని పాత ఇరిగేషన్‌ కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అక్కడ అవసరమైన మార్పులు చేర్పులు చేయించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ నెల 24వ తేదీన విశ్వభూషణ్‌ ఏపీ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణం చేయించనున్నారు. అలాగే గవర్నర్‌ కార్యదర్శిగా ముకేశ్‌కుమార్‌ మీనాను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎంకే మీనాకు.. గవర్నర్‌ కార్యదర్శిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.

విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఒడిశాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒడిశా రాష్ట్ర న్యాయ శాఖ మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు హరిచందన్‌ నియమితులైనందున నరసింహన్‌ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా కొనసాగుతారు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నియమింపబడ్డ నరసింహన్ దాదాపుగా 10 సంవత్సరాలపైన గవర్నర్ గా ఉన్నారు. చూడబోతే మరికొంత కాలం ఆయనను కొనసాగించే అవకాశం కనిపిస్తుంది.