YS Jagan New Districts in APరాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు 26 జిల్లాలని పొరుగు రాష్ట్రంవారు కూడా నవ్వుకొంటున్నారు. నవ్వితే నవ్విపొదురుగాక నాకేటి…అంటూ ఆఘమేఘాల మీద 13 జిల్లాలను 26 జిల్లాలుగా విడగొట్టేసింది జగనన్న ప్రభుత్వం. తమ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ సూత్రంతో పనిచేస్తున్నందున ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అని వైసీపీ నేతలు చెప్పుకొన్నారు. అయితే నిజంగా పరిపాలనా వికేంద్రీకరణ కోసమేనా? కానీ దానికి ఇప్పుడు తొందరేమోచ్చింది? అని వైసీపీ ప్రభుత్వానికి ముందుచూపు లేదని వాదించేవారు సిల్లీగా అడిగారు. కానీ మంత్రివర్గ విస్తరణకు ముందు హడావుడిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంటే దేనికో అర్ధం చేసుకోలేకపోయిన తామే తెలివితక్కువ వాళ్ళమని తరువాత వారికే అర్దమైంది.

మంత్రి పదవులు కోల్పోయినవారికి, పదవులు ఆశించి భంగపడి అసంతృప్తితో రగిలిపోతున్నవారికి రాజకీయ ఉద్యోగాలు కల్పించేందుకే హడావుడిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారనే అప్పుడే గుసగుసలు వినిపించాయి. అవి నిజమని మంత్రివర్గ విస్తరణ తరువాత రుజువైంది.

ఒకవేళ 13 జిల్లాలే ఉండి ఉంటే 13 మందికి మాత్రమే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వగలిగేది కానీ ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పాటు చేసుకొన్నందున 26 మందికి జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి. వాటితోపాటే వారి అనుచరులకు జిల్లా స్థాయి పదవులు లభించాయి. వాటితో వారు సంతృప్తి చెందారా…లేదా?అనే విషయం పక్కన పెడితే వైసీపీలో రాజకీయ నిరుద్యోగ సమస్య, అసంతృప్తి సెగలు తగ్గించుకోవడానికి కొత్త జిల్లాల ఏర్పాటు చాలా ఉపయోగపడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

అదీగాక…13 జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు అందరూ కలిపి ఎంత తక్కువగా వేసుకొన్నా కనీసం 300-400 మందికి పైనే ఉంటారు. ఒక ఒరలో రెండు కత్తులే ఇమడనప్పుడు 13 జిల్లాలలో ఇంతమంది సర్దుకుపోవడం చాలా కష్టం. అందుకే జిల్లాలలో నేతల మద్య తరచూ కుమ్ములాటలు, ఆధిపత్యపోరులు కొనసాగుతున్నాయి. కనుక అదనంగా మరో 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ సమస్య కూడా కొంత వరకు పరిష్కారం అవుతుందని వేరే చెప్పక్కరలేదు.

కనుక కొత్త జిల్లాల ఏర్పాటు పరిపాలనా వికేంద్రీకరణ కోసమేనా?అని అడిగితే రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుంది?అని అడిగినట్లు ఉంటుంది.