ap-assemblyఇటీవల సినిమాలకు ఫస్ట్ లుక్ లు విడుదల చేస్తున్న మాదిరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇటీవల ముగిసిన వర్షాకాలపు సమావేశాలే హైదరాబాద్ లో ఏపీకి సంబంధించి చివరి సమావేశాలు. ఇక నుండి అమరావతి వేదికగా జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించిన నేపధ్యంలో… కొత్త అసెంబ్లీ ఎలాంటి హంగులతో సిద్ధమవుతోంది అన్న ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు, అసెంబ్లీ వీక్షకులలో కూడా ఉంది.

దానికి సమాధానమే ఈ ఫోటోలు. ఔరా… అనిపించే విధంగా అసెంబ్లీ ‘ఇన్ సైడ్’ ఉందని ఈ ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సదుపాయాలతో ఓ ఫైవ్ స్టార్ హోటల్ మాదిరి దర్శనమిస్తోంది ఏపీ అసెంబ్లీ. త్వరలో జరగనున్న శీతాకాల సమావేశాలు ఈ అసెంబ్లీలోనే జరగనున్నాయి. కొత్త అసెంబ్లీని ప్రారంభించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోనుంది. ఈ అసెంబ్లీకి సంబంధించిన ఫోటోలతో రాజధాని నిర్మాణంపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.

అనుభవజ్ఞుడుగానే కాదు, అత్యాధునిక సౌకర్యాలను వినియోగించుకోవడంలో కూడా చంద్రబాబు దిట్ట అన్న విషయం తెలిసిందే. అంత నమ్మకం ఉంది కాబట్టే బాబు గారి చేతికి అంతర్జాతీయ రాజధాని నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. తాత్కాలిక అసెంబ్లీనే ఈ రేంజ్ లో సిద్ధం చేస్తే… పర్మినెంట్ అసెంబ్లీ సిద్ధమైతే… మన ఎమ్మెల్యేల దుకాణం అంతా అక్కడికే సర్దేసినా ఆశ్చర్యపడనవసరం లేదని, ఈ అసెంబ్లీ ఫోటోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.