Andhra Pradesh needs a KCRతెలంగాణా సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేసి, అంతిమంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 60 ఏళ్ల పోరాటం ఒకెత్తు అయితే, కేసీఆర్ ఉద్యమ రూపం మరో ఎత్తు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలి అన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిన నేతగా కేసీఆర్ నిలిచిపోయారు. ప్రజలను భాగస్వామ్యులను చేసిన తర్వాత తెలంగాణా సాధన మరో రూపం సంతరించుకుని ఢిల్లీ నేతల మెడలు వంచేలా చేసింది. ఇందులో రాజకీయ లబ్దిని పక్కన పెడితే… ఆ కార్యదక్షత, పట్టుదల ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమైంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు కూడా కేసీఆర్ లాంటి ఒక నేత అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి… ఢిల్లీ పెద్దల మెడలు వంచడానికి… కేసీఆర్ లాంటి ఒక నేత కావాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కేంద్రంపై తిరుగుబావుట ఎగురవేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎదురుదాడి చేస్తే… రాల్చే ఆ నాలుగు చుక్కలు కూడా రావన్న మీమాంసలో ఏపీ సర్కార్ ఉంది. ఇక, ప్రతిపక్షంలో ఉన్న జగన్ గురించి చెప్పుకోవడం కంటే కూడా, ప్రతిపక్షం లేదని విస్మరించడం ఆరోగ్యానికి ఎంతైనా శ్రేయస్కరం.

తన కేసులు, పార్టీ నుండి జారుకుంటున్న నేతలను గమనించుకోవడానికే పార్టీ అధినేతకు సమయం సరిపోవడం లేదన్న విశ్లేషణలు వస్తున్న నేపధ్యంలో ఇక ఏపీకి దక్కాల్సిన అంశాలపై జగన్ పోరాటం చేస్తారనుకోవడం రాజకీయ అమాయకత్వంగా భావించాల్సి వస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అక్రమాస్తుల కేసులు తల నిండుగా ఉన్న నేపధ్యంలో ఢిల్లీలో పోరాటం ధైర్యం జగన్ కు లేకపోయింది… దీంతో ఎంతో కొంత రాజకీయ లబ్ది రాకపోతుందా అని, ఏపీలో తాను కూడా ఉన్నానని ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు దీక్షలు చేస్తూ కాలం వెలిబుచ్చుతున్నారు.

జగన్ తో పోలిస్తే వర్ధమాన నటుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు అయిన శివాజీ కాస్త మెరుగుగా పరిపక్వంగా ప్రసంగిస్తారని ఇటీవల పలు సందర్భాలలో స్పష్టమైంది. ఇది రాష్ట్ర సమస్యే కానీ, రాష్ట్రంలో చూపించాల్సిన సమస్య కాదు, కేంద్ర స్థాయిలో ఒత్తిడిలు తీసుకురావాలన్న అవగాహనను శివాజీ వ్యక్తం చేయడం విశేషం. అయితే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళేటంత సామర్ధ్యం గానీ, శక్తి గానీ శివాజీ వద్ద లేవు. ఆ సమితి మిగతా సభ్యులు చలసాని శ్రీనివాసరావు తదితరులు చేస్తున్న కార్యాచరణ కూడా ప్రజలపై అంతంత మాత్రపు ప్రభావమే చూపుతోంది.

ఏపీకి కష్టం గానీ, నష్టం గానీ జరిగితే నేనున్నాను అన్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్… ఇప్పట్లో స్పందించే అవకాశాలు కనపడడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ‘ప్రత్యేక హోదా’ సమాచారాన్ని సమగ్రంగా ప్రజలకు తెలియజేసి, ఒక ఉద్యమ రూపం తీసుకువచ్చే నాయకుడు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. బహుశా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఒక్కరు ఏపీలో ఉన్నా… ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే అవకాశం ఉండేది. 13 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి ఒక్క నాయకుడు కూడా లేకపోవడం శోచనీయమే అయినా… ఏపీకి పట్టిన “రాజకీయ దరిద్రం” ఆ కొరతను ప్రతిబింబిస్తోంది.