Andhra Pradesh needs 13 capitalsఆంధ్రప్రదేశ్ లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని సంవత్సరాల ముందు అసలు రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, మరియు కర్నూల్ లో జ్యుడీషియల్ కేపిటల్ ఉండవచ్చు అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

“దక్షిణాఫ్రికా దేశాన్ని చూస్తే వారికి మూడు రాజధానులుంటాయి. బహుశా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమో. మూడు రాజధానులు రావలసిన అవసరం కనిపిస్తోంది” అని జగన్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవు. అయితే ఈ సంబరం అక్కడితో ఆగడం లేదు.

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మరి కొన్ని డిమాండ్లు తెర మీదకు తెస్తున్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పోరాట సమితి డిమాండ్‌ చేసింది. ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిని ప్రకటించకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

అదేదో సంఘం రాజమండ్రిని సాంస్కృతిక రాజధానిగా ప్రకటించమని డిమాండ్ చేస్తుంది. ఈ లెక్కన మూడు రాజధానులతో ఆగిపోకుండా పదమూడు జిల్లాలకు సరిపడా పదమూడు రాజధానుల డిమాండ్ మొదలవుతుందేమో?