Andhra-Pradesh-Movie-Tickets-price-controllingప్రభుత్వాలు పరిపాలనకు పరిమితమైతే చాలు. కానీ అవి కూడా వ్యాపారాలు చేయాలనుకొంటున్నాయి లేదా అన్నిటినీ తమ గుప్పెట్లో ఉంచుకొని నియంత్రిస్తూ అయినకాడికి పిండుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్స్ అమ్మకాలను కూడా ఏపీ ప్రభుత్వం తన గుప్పెట్లో ఉంచుకోవాలనుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణ.

ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లలో టికెట్లను ఏపీ ఫిలిమ్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ ఎఫ్‌డిసి) ఏర్పాటు చేయబోయే సర్వీస్ ప్రొవైడర్‌ ప్లాట్‌ఫారం ద్వారానే ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్‌ గుప్తా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

వాటి ప్రకారం ఏపీఎస్ ఎఫ్‌డిసి ఓ సర్వీస్ ప్రొవైడర్‌ ప్లాట్‌ఫారంను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో సినిమా థియేటర్స్ యాజమాన్యాలన్నీ ప్లాట్‌ఫారంతో అనుసంధానమయ్యేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటుచేసుకొని, ఆ పేమెంట్ గేట్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్స్ అమ్మవలసి ఉంటుంది.

దీనికి సేవా రుసుముగా టికెట్ ధరలో 2 శాతం వరకు థియేటర్ యాజమాన్యాలు సదరు సంస్థకు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్స్ అమ్ముతున్న సంస్థలు కూడా ఈ ప్లాట్‌ఫారం ద్వారానే లావాదేవీలు జరపవలసి ఉంటుంది.

సినీ పరిశ్రమ, సినిమాలు, థియేటర్లు, టికెట్ల అమ్మకాలు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా మొదలైనవి కావు. దశాబ్ధాలుగా ఉన్నవే. ఇన్ని దశాబ్ధాల కాలంలో అన్నిటితో పాటే సినిమా టికెట్ రేట్లు కూడా క్రమంగా పెరిగాయి తప్ప హటాత్తుగా పెరగలేదు.

ఒకప్పటి సినిమాలతో పోలిస్తే నేటి సినిమాలకు భారీగా ఖర్చవుతోంది. కానీ ఎంత పెద్ద, ఎంత గొప్ప సినిమా అయినప్పటికీ ఇప్పుడు థియేటర్లలో వందరోజులు ఆడే పరిస్థితి లేదు. కనుక ప్రభుత్వ అనుమతితోనే మొదటి పదిరోజులలో టికెట్ ధరలు పెంచుకొని పెట్టుబడిని రాబట్టుకొనేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు.

ప్రజలకు వినోదం పంచే సినీ పరిశ్రమకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఇండస్ట్రీతో సంబందం ఉన్నవారందరికీ తెలుసు. అధికార పార్టీలో కూడా అటుయవంటివారు చాలా మందే ఉన్నారు కనుక ప్రభుత్వానికి సినీ కష్టాల గురించి తెలియదనుకోలేము.

ఒకవేళ తెలిసి ఉండకపోతే చిరంజీవి నేతృత్వంలో వచ్చిన సినీ ప్రముఖులు నేరుగా సిఎం జగన్మోహన్ రెడ్డికే తమ బాధలన్నీ చెప్పుకొన్నారు కనుక ఖచ్చితంగా తెలుసని అర్ధమవుతోంది. అయినా సినిమా టికెట్ అమ్మకాలను కూడా వైసీపీ ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవడం చాలా బాధాకరం. ఇటువంటి ఆలోచనలు, నిర్ణయాలతో సినీ పరిశ్రమ దానిపైనే ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాదిమంది జీవితాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.