ఒక్క అవకాశం ఇవ్వండి… మరో ముప్పై ఏళ్ళు గుర్తుండిపోయే పాలనను ఇస్తానని గత ఎన్నికలలో ప్రధాన ప్రచార అస్త్రంగా చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అందుకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నారు. అయితే జగన్ చెప్పినట్లు 30 ఏళ్ళు కాదు, మరొక తరం కూడా అంటే 60 ఏళ్ళ పాటు గుర్తుండిపోయేలా పాలన చేస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట.

అవును… ఇది అక్షర సత్యం అనిపించే విధంగా… ప్రస్తుతం దేశం మొత్తం జగన్ పాలన వైపే చూస్తోంది. దీనికి ఒక్కో అంశం దోహదపడుతూ వస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డిస్కమ్స్ కు చెల్లించాల్సిన 9783 కోట్లు బకాయిలు చెల్లించని పక్షంలో ఆంధ్రప్రదేశ్ తో ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకుంటామని ప్రకటించగా, దీనికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది.

ఇదిలా ఉంటే… అసోసియేషన్ అఫ్ ఇండియన్ మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీ (ఏఐఎంఈడీ) ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వ్యతిరేకంగా ఓ రెడ్ నోటీసును విడుదల చేసింది. 100 శాతం ముందస్తు చెల్లింపులు లేకుండా ఏపీఎంఎస్ఐడిసి కి ఏమీ సప్లై చేయవద్దని, గత నాలుగైదు ఏళ్లుగా ఏపీ నుండి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లింపులు కావడం లేదని స్పష్టం చేసింది.

అధికారంలో ఉన్న ఎలాంటి పార్టీకైనా ఇలాంటి ‘రెడ్ నోటీసు’లు రావడం సిగ్గుచేటు. గతంలో జగన్ చెప్పినట్లుగా ఇప్పుడు “దేశం మొత్తం మన వైపే చూస్తోంది,” అయితే ఏ విధంగా పరిపాలన చేయాలో అన్న విషయంలో మాత్రం కాదు! అన్నది రాజకీయ విమర్శకుల మాటలు! ‘ఆదాయం అందరిదీ – పంపకాలు కొందరికీ’ అని విపక్ష పార్టీలు గొంతెత్తి చించుకుంటున్న విమర్శలకు… ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరింత బలాన్నిస్తున్నాయి.