Makara_Sankranthi_Wishesనేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భోగీ పండుగ ఘనంగా జరుపుకొంటున్నారు. ప్రజలు తెల్లవారుజామునే లేచి భోగీ మంటలు వేసి ఇంట్లో పనికిరాని కలపని మంటల్లో వేసి వదిలించుకొని సంబరాలు చేసుకొంటున్నారు. నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ కుటుంబాలు కూడా ఉత్సాహంగా భోగీ పండుగ జరుపుకొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న టిడిపి కార్యకర్తలు, ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్:1 కాపీలని భోగీ మంటల్లో వేసి విన్నూత్నంగా తమ నిరసనలు తెలిపారు.

ఇంట్లో పనికిరాని కలప వస్తువులని ఏవిదంగా వదిలించుకొంటామో అదేవిదంగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోని కూడా వదిలించుకొన్నామని, అలాగే ప్రజలని పీడిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కూడా వచ్చే ఎన్నికలలో వదిలించుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నా వాటి లక్ష్యం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కావాలి తప్ప పాలకుల సొంత అజెండాలు విధానాలుగా మారకూడదు. టిడిపి హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి నిర్మాణపనులు చేపట్టినప్పుడు అభ్యంతరం చెప్పని వైసీపీ, అధికారంలోకి రాగానే దానికి తాము వ్యతిరేకమని వాదిస్తూ మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.

దాంతో అమరావతిపై గత ప్రభుత్వం ఖర్చు చేసిన వేలకోట్లు వృధా కావడమే కాక నేటికీ మూడు రాజధానులు ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంది. సంక్షేమ పధకాలను తప్ప రాష్ట్రాభివృద్ధిని పట్టించుకొని వైసీపీ నేతలు మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాదిస్తుండటం చిత్రంగా ఉంటుంది. దాంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందో లేదో తెలీదు కానీ మూడు ప్రాంతాల ప్రజల మద్య ప్రాంతీయ విద్వేషాలు మాత్రం రగులుకొంటున్నాయి.

ఒక్కో జిల్లాకి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ తమ జిల్లాలని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారి ప్రభుత్వం సంక్షేమ పధకాలకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తోంది తప్ప అభివృద్ధికి కాదు కనుక. కానీ ఈ విషయం వారు ప్రజలకి చెప్పుకోలేరు కనుక మూడు రాజధానులు ఏర్పాటు కాకపోతే జిల్లాలు అభివృద్ధి కావని వితండవాదం చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోతే పోయే కానీ వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, ప్రజలని మళ్ళీ విడగొట్టాలనుకోవడం చాలా దారుణం అనే భావన ప్రజలలో నెలకొంది.

ఈ మూడు రాజధానులు, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ కూడా టిడిపి, జనసేనలని మూడు ప్రాంతాలలో తిరగనీయకుండా చేసి రాజకీయంగా దెబ్బ తీయడానికే వైసీపీ అమలుచేస్తున్న పెద్ద రాజకీయ వ్యూహమని భావించవచ్చు. అందుకే మంత్రి హోదాలో ఉన్న ధర్మాన ప్రసాదరావు వంటివారు ఆ మంటలు ఆరిపోకుండా ఉంచేందుకు ప్రత్యేక రాష్ట్రమనే ఆజ్యం పోస్తున్నారని చెప్పుకోవచ్చు.

అమరావతి, మూడు రాజధానుల గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో పట్టించుకోకుండా “ఉద్యమానికి సిద్దం కమ్మంటే కారేమి? మీకు బాధ్యత లేదా?” అంటూ మంత్రి ధర్మాన ప్రజలనే నిలదీస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ మూడు రాజధానులు ఏర్పాటు చేయలేకపోతున్న వైసీపీ నేతలు, దానికీ టిడిపి, జనసేనలని నిందిస్తూ కాలక్షేపం చేస్తుండటం మరో విచిత్రం.

సరే! రాజధాని విషయంలో వైసీపీ, టిడిపిల వైఖరి ఏమిటో స్పష్టం అయిపోయింది. కనుక వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలు ప్రజల వద్దకి వెళ్ళినప్పుడు వారు ఎలాగూ తమ తీర్పు చెపుతారు. కనుక వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిద్దాం.