AP_Politics_Casteకాబోయే రాజధానిగా చెప్పబడుతున్న ఓ నగరంలో ఇటీవల ఓ కుల సంఘపు ప్రతినిధులు జేఏసి పేరుతో సమావేశమయ్యారు. ఆ సమావేశం ఎజెండా రాజధాని విషయంలో ప్రభుత్వ విధానాలకు మా కులం మద్దతు తెలుపుతుంది అని. ఆ కులానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి మాట్లాడిన మాటల వీడియెూ ఒకటి సామాజిక మాద్యమాలలో ఉదృుతంగా తిరుగుతుంది. ఆ వీడియెూలో మాటలు ప్రజలను విస్తుగొలిపుతున్నాయి. ఆయన మాటల్లో “పరిపాలించేది మన కులం మిగిలిన అందరికీ అవకాశాలు ఇస్తున్నాం, యస్సీ, యస్టీ, మైనారిటీ, బిసి లకు ప్రాముఖ్యత ఎందుకిస్తున్నామంటే వాళ్లు మనకు పోటీ కాదు, రాజకీయంగా వాళ్లు మనకి పోటీ కాదు, మనకు పోటీ మరో రెండు కులాలే. వారిలో ఓ కులం ఎవరెవరినో తెచ్చుకుని ప్రయత్నించారు, వాళ్ళ వల్ల కాలేదు, ఇప్పుడొక నటుడిని తెచ్చుకున్నారు, వీళ్లను 2024 లో ఓడిస్తే ఇక మనకి పోటీనే లేదు” ఇలా సాగింది ఆయన ప్రసంగం. కుల సంఘాలు కొన్ని ఉద్యమాలకు మద్దతివ్వడం మామూలే కానీ ఓ కులం కార్యాచరణ కమిటీగా ఏర్పడి మద్దతుగా ఓ మీటింగ్ పెట్టడం దేశ చరిత్రలోనే తొలిసారి కావచ్చును. కానీ అసలు విషయం వదిలి మన కులానికి దళితులు, బిసిలు, మైనారిటీలు అసలు పోటీనే కాదు, ఈసారి గెలిస్తే మనకు పోటీనేలేదు, ఎల్లకాలం మనదే అధికారం అంటూ జాత్యహంకారపు మాటలు మాట్లాడటంపై దళిత, బిసి, మైనారిటీ వర్గాల ప్రజలు సోషల్ మీడియాల్లో మండిపడుతున్నారు.

అక్కడ రాజధాని పేరుతో ఆ వర్గంలోని ప్రముఖులు ఇప్పటికే నయానో, భయానో పెద్ద సంఖ్యలో భూములు సంపాదించారనే ఆరోపణల వచ్చి ప్రజలు రాజధాని మార్పు లోగుట్టుపై చర్చిస్తున్న తరుణంలో, ఆ వర్గానికి చెందిన సంఘాలు జేఏసి పేరుతో ఓ సభ పెట్టి యస్సీ, యస్టీ, మైనారిటీ, బిసి వర్గాలు మనకు పోటీ కాదు, మన నాయకుడిని మనం కాపాడుకోవాలి, 2024 మన వర్గానికిక పోటీ లేకుండా పోతుంది వంటి వ్యాఖ్యలు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఓ ప్రజాప్రతినిధి మాట్లాడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో ఇదే వర్గానికి చెందిన పక్క రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కూడా గతంలో ఓ సభలో మాట్లాడుతూ ‘మాకులం మాత్రమే పరిపాలించగలదు’ అనే వ్యాఖ్యలు చేయడాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఆ వర్గపు నాయకుల ఆలోచనా సరళిని తప్పుపడుతున్నారు. జేఏసి అంటే ‘జాత్య అహంకారపు కమిటీనా’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ఇతర వర్గాలను చిన్నబుచ్చే ఇటువంటి జాత్యహంకారపు మాటలు సమర్ధనీయం కాదు.

శ్రీకాంత్.సి