YS-Jagan-Mohan-Reddy in AP Assemblyఇటీవల జంగారెడ్డిగూడెంలో 26 మంది ఒకేసారి మరణించిన వైనం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ మరణాలపై నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన స్పీచ్ హాస్యాస్పదంగా మారి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ 26 మంది కూడా సహజంగా మరణించిన వారేనని సీఎం అసెంబ్లీలో ప్రకటన చేసారు.

2011లో చిన్న మునిసిపాలిటీగా ఉన్న ప్రాంతం నేడు 2022లో ఓ పెద్ద మునిసిపాలిటీగా ఆవిర్భవించిందని, ఇంత పెద్ద మునిసిపాలిటీల్లో నిష్పత్తు ప్రకారం 90 మంది వరకు మరణించి ఉండాలని, కానీ 26 మంది మాత్రమే మరణించారని, వీరంతా వివిధ కారణాలతో మరణించారని, ఇందులో ‘గుండెపోటు’ కూడా ఒకటని సీఎం చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇలా చెప్పగా, నేడు జంగారెడ్డిగూడెం వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు నాయుడు మాత్రం, ఈ 26 మంది మరణాలు ప్రభుత్వ హత్యలుగా కీర్తించారు. ఏపీలో మద్యాన్ని జగనే విక్రయిస్తున్నారని, కల్తీ సారాకు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర విమర్శలు చేసారు.

అధికార – ప్రతిపక్ష నేతల మాటలు ఇలా ఉంటే అసలు బాధిత కుటుంబాలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అంటే కల్తీ సారా తాగి తమ వాళ్ళు కాటికి కాళ్ళు జాపారని మీడియా వేదికగా తమ గోడు వెలిబుచ్చుకుంటున్నారు. చంద్రబాబు సమక్షంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా, ముందుగా ప్రతి ఒక్కరికి ఒక లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రకటన చేసారు.

ఇక్కడ మరో కొసమెరుపు ఏమిటంటే… నిజం చెప్తే బాధిత కుటుంబాలకు వచ్చే పెన్షన్, రేషన్ వంటి ప్రభుత్వ సదుపాయాలను ఆపేస్తామని బెదిరించినట్లుగా చంద్రబాబు ఓ సంచలన ప్రకటన కూడా చేసారు. ఇది అత్యంత సిగ్గుమాలిన చర్యగా కొట్టిపడేసారు. విశాఖలో చెల్లించినట్లుగా ప్రభుత్వం తరపున ఒక కోటి రూపాయలను ప్రతి కుటుంబానికి అందివ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.

ఈ మరణాల విషయంలో సీఎం గారి మాటలు అత్యంత దయనీయంగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జనాభా నిష్పత్తిలో ప్రజలు చనిపోవాలని జగన్ కోరుకుంటున్నారా? అసలు ఇదేమి వింత పోకడ? అంటూ సోషల్ మీడియా విమర్శలైతే కోకొల్లలు. దేశంలో ఏ నేత అయినా ఇలాంటి వితండ వాదనను వినిపించిన చరిత్ర ఉందా?