Pawan_Kalyan_Janasenaఎన్నికలలో ఓటర్లను ఆకట్టుకొనేందుకు రాజకీయపార్టీలు ఆకర్షణీయమైన నినాదాలు ప్రచారంలోకి తెస్తుంటాయి. గత శాసనసభ ఎన్నికలలో వైఎసార్ కాంగ్రెస్ పార్టీ ‘రావాలి జగన్…కావాలి జగన్’ అంటూ చేసిన ప్రచారంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు తాపీగా బాధపడుతున్నారు.

తాజాగా టిడిపి ‘క్విట్ జగన్…సేవ్ ఆంద్రప్రదేశ్‌’ అనే సరికొత్త నినాదం చేస్తోంది. అది రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పడుతోంది కనుక దానిలో తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ టిడిపిని చూసి జనసేన కూడా ఓ కొత్త నినాదం అందుకొంది. అదేమిటంటే, ‘పోవాలి జగన్…. రావాలి పవన్..’ అని.

జగన్ మూడేళ్ల పాలనపై ప్రజాభిప్రాయం తెలియజేస్తూ తిరుపతి జనసేన నేతలు, ‘పోవాలి జగన్…. రావాలి పవన్..’ అనే నినాదంతో ఓ పోస్టరుని విడుదల చేసారు.

తమ అధినేత ముఖ్యమంత్రి కావాలని వారు కోవడం సహజమే. కానీ గత ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన తమ అధినేత, ఈసారి ముఖ్యమంత్రి అయిపోవాలని వారు కోరుకోవడం కాస్త అత్యాశగానే కనిపిస్తుంది. ఈసారి ఎన్నికలలో జనసేన, టిడిపితో పొత్తులు పెట్టుకోబోతోందని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. కనుక టిడిపితో ఎన్నికల పొత్తులు పెట్టుకొని వారి కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు కానీ పవన్ కళ్యాణ్ కాలేరు కదా? కనుక వారి నినాదంలో ‘పోవాలి జగన్..’ వరకు సాధ్యపడవచ్చు కానీ ‘రావాలి పవన్…’ మాత్రం ఇప్పట్లో సాధ్యపడేది కాదనే చెప్పవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసి టిడిపి, వైసిపీలను ఓడించి అధికారంలోకి రాగలిగితే అప్పుడు వారి ఈ నినాదం సరిపోతుంది.