Pawan-Kalyan Janasena నందమూరి అన్నగారిని చూసి చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి ఎదురుదెబ్బలు తిన్నారు. అది చూసి కూడా పవన్‌ కల్యాణ్‌ జనసేనతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. కానీ పవన్‌ కల్యాణ్‌ నేటికీ రాజకీయాలలో పూర్తిగా నిలద్రొక్కుకోలేకపోవడానికి అనుభవరాహిత్యం కొంత, కనుసైగ చేస్తే వేలాదిమందిగా వాలిపోయే అభిమానులను.. వారి చప్పట్లను ఓట్లుగా మార్చుకోవడంలో విఫలంకావడం మరికొంత కారణాలుగా కనిపిస్తున్నాయి. పార్టీని నడిపించడం కోసమైతేనేమీ..అభిమానుల ముచ్చట తీర్చడం కోసమైతేనేమీ.. ఎన్నికలైపోగానే సినిమాలు చేసుకొంటుండటం వలన కూడా ఆలస్యమవుతోందని చెప్పవచ్చు.

అయితే ఈసారి ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రం నడిబొడ్డున వైసీపీ అడ్డాలోనే నిన్న భారీ బహిరంగ సభ పెట్టి తన అభిప్రాయాలను, ఆలోచనలను బలంగా చెప్పడం చూస్తే ఈసారి కృతనిశ్చయంతోనే వచ్చినట్లు కనబడుతున్నారు. ముఖ్యంగా జనసేన వలన టిడిపి ఓట్లు చీలనీయనని చెప్పడం ద్వారా మళ్ళీ టిడిపికి దగ్గరవుతున్నట్లు సంకేతం ఇచ్చారు. అయితే టిడిపిని వ్యతిరేకిస్తున్న బిజెపికి ఆయన గుడ్ బై చెప్పేస్తారా లేదా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

గత ఎన్నికలలో జనసేనకు, సేనానికి పెద్ద ఎదురుదెబ్బలే తగిలినప్పటికీ, ఆ చేదు అనుభవాలు చాలా విలువైన పాఠాలే నేర్పించాయని చెప్పవచ్చు. అదీగాక ఏపీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతున్నా కేంద్రప్రభుత్వం కిమ్మనకపోగా బిజెపి తనను అడ్డం పెట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏపీలో అధికారంలోకి రావడం ఎలా? అని మాత్రమే ఆలోచిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ గుర్తించారేమో? బహుశః అందుకే మళ్ళీ టిడిపితో చేతులు కలిపేందుకు సిద్దం అవుతున్నారేమో?

అయితే ఒక్కో ఎన్నికలకీ ఒక్కో పార్టీతో… ఒక్కో విదంగా ప్రజల ముందుకు వస్తుంటే పవన్‌ కల్యాణ్‌ మాటలను ఎవరు నమ్మలేరు. ఆయన విశ్వసనీయత కూడా దెబ్బ తింటుంది. కనుక ఇకనైనా ఖచ్చితమైన నిర్ణయాలు, విధానాలతో ముందుకు సాగితే మంచిది. తనను చూసి చప్పట్లు కొట్టేవారందరూ ఓట్లు వేయరని ఇప్పటికే స్పష్టం అయ్యింది కనుక పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ బలాబలాలను సరిగ్గా అంచనావేసుకొని అడుగు ముందుకు వేయడం మంచిది లేకుంటే జనసేనతో పాటు అది పొత్తులు పెట్టుకొనే పార్టీ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది.