bandi srinivasulu - bopparaju venkateswarluఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వివాదం మొన్న‌టి వ‌ర‌కు ఎంత ర‌చ్చ‌లా సాగిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల త‌ర్వాత ఉద్యోగులు స‌మ్మెను విర‌మించుకున్నారు. అస‌లు ఉద్యోగుల‌ను స‌మ్మె వ‌ర‌కు తీసుకెళ్ల‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత‌లు. వారి నేతృత్వంలోనే ఛ‌లో విజ‌య‌వాడ లాంటి కీల‌క నిర్ణ‌యాలు కార్య‌రూపం దాల్చాయి.

త‌మ డిమాండ్ల‌కు ఒప్పుకోవాల్సిందేనంటూ ప్ర‌భుత్వం మీద మొద‌ట్లో తీవ్ర ఒత్తిడి తీసుకు వ‌చ్చిన జేఏసీ నేత‌లు.. తెల్లారితే స‌మ్మె అన‌గా ప్ర‌భుత్వంతో మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయిన‌ట్టు చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇందులో ఇచ్చిన హామీ ప్ర‌కారం కొత్త జీవోల‌ను ఇచ్చిన త‌ర్వాత అశుతోష్ మిశ్రా నేతృత్వంలో వేసిన క‌మిటీ నివేదిక‌ల‌ను బ‌హిర్గ‌తం చేయాలి.

వాటి ఆధారంగానే కొత్త పీఆర్సీని ప్ర‌క‌టించాలి. కానీ ప్ర‌భుత్వం దాన్ని ప‌క్క‌న పెట్టేసి, సీఎస్ ఇచ్చిన దాని ప్ర‌కారం పీఆర్సీ అమ‌లు చేస్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘాలు జేఏసీ లీడ‌ర్ల మీద తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ ప్ర‌కారం అశుతోష్ మిశ్రా నివేదిక‌ను చూపించ‌క‌పోవ‌డాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌ట్లేద‌ని జేఏసీ లీడ‌ర్ల మీద తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్‌లో జేఏసీ కీల‌క నేత‌లు శ్రీనివాస‌రావు, బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు క‌లిసి పాల్గొన‌డం ఆస‌క్తి రేపుతోంది. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో వారు ప‌క్కాగా వైసీపీకి అనుకూల‌మైన మాట‌లు మాట్లాడిన‌ట్టు ఉద్యోగులు ఆ వీడియోల‌ను పోస్టు చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఉద్చోగుల త‌ర‌ఫున మాట్లాడాల్సిన వీరు ప్ర‌భుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శిస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే.. వైసీపీ ప్ర‌భుత్వానికి వీరు సానుభూతిప‌రులుగా మారిపోయారంటున్నారు చాలామంది. నివేదిక‌ల‌పై ప్ర‌శ్న‌లు అడిగితే త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని మండిప‌డుతున్నారు ఉద్యోగులు. నిజానికి వైసీపీ నేత‌ల కంటే కూడా వీరే ఆ పార్టీకి మంచి వాయిస్ గా మారిపోయారంటూ సెటైర్లు వేస్తున్నారు ఉద్యోగులు, రాజ‌కీయ విశ్లేష‌కులు.