L Ramana - Chandrababu Naidu - TDP TSతెలంగాణాలో కాంగ్రెస్ టీడీపీల పొత్తు దాదాపుగా ఖరారు అయినట్టే. ప్రస్తుతం సీట్ల పంపకాల పై కసరత్తు జరుగుతుంది. టీడీపీ బలంగా ఉన్న సీట్లను గుర్తించే పనిలో ఉంది టీడీపీ నాయకత్వం. ఏపీ నిఘా విభాగానికి చెందిన అరవై మంది సిబ్బంది హైదరాబాద్ లోని డిజిపి కార్యాలయంలో మకాం వేసి తెలంగాణలో టిడిపి అవకాశాలపై సర్వే చేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్‌ బృందాలు 20 అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టినట్లు టీటీడీపీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, సనత్‌నగర్‌లో సర్వే నిర్వహిస్తున్నారు. వీటిలోని స్థానాలు తమకు కావాలని అడగనున్నట్టు సమాచారం.

అలాగే రూరల్‌ ప్రాంతాలైనా నిజామాబాద్‌లో ఓ అసెంబ్లీ, మెదక్‌లో నారాయణ్‌ఖేడ్, వరంగల్‌లో నర్సంపేట్, కరీంనగర్‌లో కోరుట్ల, ఖమ్మంలో సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం, నల్గొండలో కోదాడ, మహబూబ్‌నగర్‌లో మక్తల్, వనపర్తి, దేవరకద్ర, ఆదిలాబాద్‌లో ఖానాపూర్‌ లేదా ఆసిఫాబాద్‌లో బృందాలు సర్వే చేస్తున్నట్లు తెలిసింది. పొత్తులో భాగంగా ఇదే స్థానాలను టీటీడీపీ కోరే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

పొత్తులో భాగంగా 20 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా వర్గాలలో అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు. వీలైనంత తొందరగా అభ్యర్థులను ఖరారు చేసి వారికి ప్రచారం కు తగినంత సమయం ఇవ్వాలనేది వ్యూహంగా కనిపిస్తుంది.