Andhra Pradesh income on liquorతమకు అధికారమిస్తే ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని… ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యం దొరకనివ్వమని చెప్పింది వైఎస్సార్ కాంగ్రెస్. అయితే ఇప్పుడు మద్యం ద్వారా వచ్చే ఆదాయానికి బానిసయ్యింది జగన్ ప్రభుత్వం. 2019-20లో ఎక్సైజ్ టాక్స్ రూపంలో ప్రభుత్వానికి 6,914 కోట్ల ఆదాయం వచ్చింది.

ఆ తరువాత ఇబ్బడిముబ్బడిగా పెంచిన రేట్లతో 7,931 కోట్ల ఆదాయం అంచనా వెయ్యగా… ఏకంగా 11,535 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ టాక్స్ తో పాటు మద్యం మీద వచ్చే వ్యాట్ ఆదాయం కూడా కలిపితే మద్యం వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం దాదాపుగా 18,000 కోట్లు. ఇక కరోనా కారణంగా ఆర్ధిక మందగమనం, అలాగే ఆర్ధిక క్రమశిక్షణ లోపించడం కారణంగా అప్పులు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఈ ఆదాయం మీదే ప్రభుత్వం ఆశలన్నీ పెట్టుకుంది.

2021-22 సంవత్సరం బడ్జెట్ లో ఎక్సైజ్ టాక్స్ తో మాత్రమే 15,000 కోట్ల ఆదాయం అంచనా వేసింది. వ్యాట్ ద్వారా ఇంకో 5,000 కోట్లు ఆదాయం వస్తాదని అనుకుంటే…. 20,000 కోట్ల ఆదాయం మద్యం ద్వారా సమకూరుతుందని ప్రభుత్వం అంచనా. సహజంగా మద్యం నుండి వచ్చే ఆదాయం ఎప్పుడు అంచనాలకు మించే ఉంటుంది.

అంటే ఈ సారి మద్యం నుండి వచ్చే ఆదాయం బంపర్ గా ఉండబోతుంది. పైగా దీని బట్టి అధిక రాబడి కోసం ప్రభుత్వం త్వరలో మద్యం రేట్లు కూడా ఇతోధికంగా పెంచబోతుందని అర్ధం అవుతుంది. దీని బట్టి ప్రభుత్వం కూడా మద్యానికి బానిసే అంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు.