High Courtఅమరావతిని రాజధానిగా కొనసాగించాలని, నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని గత ఏడాది ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే విశాఖలో రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి బ్రేకులు వేసింది హైకోర్టే. అంటే అమరావతి రాజాధానిగా ఉండాలని స్పష్టంగా చెప్పిన్నట్లే!

రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినందున ఆ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు. కానీ ఆ తర్వాత అమరావతికి సంబందించి దాఖలయ్యే పిటిషన్లపై విచారణ జరిపిన్నప్పుడు, ఇదివరకు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పిన తీర్పుకు అనుగుణంగా కాకపోయినా కాస్త దగ్గరగా తీర్పులు లేదా ఉత్తర్వులు ఇస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు.

కానీ రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్‌-5 జోను సృష్టించి దానిలో పేదలకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేస్తుండటాన్ని సవాలు చేస్తూ రైతులు వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు భిన్నంగా స్పందించడం విశేషం.

రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం రైతులకు కేటాయించిన భూములపై తప్ప మిగిలిన భూములపై రైతులకు ఎటువంటి హక్కు ఉండదని, దానిని రాష్ట్ర ప్రభుత్వం ప్రజావసరాలకు వినియోగించుకోవచ్చనే ప్రభుత్వ న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ, రైతుల పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే ఇళ్ళ పట్టాల పంపిణీ కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై రైతులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు.

గత ప్రభుత్వం రాజధాని కోసం భూసేకరణ చేపట్టినప్పుడు రైతులతో చేసుకొన్న ఒప్పందంలో తుళ్ళూరు మండలంలోని ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కూరగల్లు గ్రామాల పరిధిలో 1,134 ఎకరాలలో పాలనకు సంబందించి కీలక నిర్మాణాలు చేపడతామని పేర్కొంది. అయితే అమరావతిని రాజధానిగా అంగీకరించని వైసీపీ ప్రభుత్వం, ఆ భూములను ఆర్‌-5 జోన్‌గా విడదీసి అక్కడ ఇతర ప్రాంతాలకు చెందిన పేదప్రజలకు ఇళ్ళపట్టాలు ఇచ్చేందుకు సిద్దపడుతోంది. దీనినే రైతులు వ్యతిరేకించారు.

గతంలో రాజధాని ఒప్పందం ప్రకారమే నడుచుకోవాలని ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు, ఇప్పుడు ప్రభుత్వం తనకు నచ్చిన విదంగా భూమిని వినియోగించుకోవచ్చునని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది! మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిని కోల్పోయినందుకు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక ఆ ప్రాంతాలలో తన ఓటు బ్యాంక్ పెంచుకొనేందుకు ఈవిదంగా ఇళ్ళ పట్టాలు పంచిపెట్టేందుకు సిద్దమవుతోందని రైతులు మొరపెట్టుకొంటే ప్రభుత్వాన్ని అడ్డుకోవలసిన హైకోర్టు దానినే సమర్ధించడం ఆశ్చర్యంగా ఉంది.

ఎట్టి పరిస్థితులలో అమరావతి రాజధానిగా ఏర్పాటు కాకూడదని పంతంపట్టిన వైసీపీ ప్రభుత్వం, ఈవిదంగా రాజధాని భూములను, ఇళ్ళ పట్టాలు వేసి పంచిపెట్టేస్తే భవిష్యత్‌లో ప్రభుత్వం మారినా అక్కడ రాజధాని కోసం భూమి మిగలకుండాపోతుంది కదా?