ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ఉండవల్లిలో గత ప్రభుత్వం రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికని ‘అక్రమ కట్టడమనే’ కారణంతో కూల్చివేసింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయమే వైసీపీ ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయలా అడ్డుపడి నోట మాట రానీయకుండా చేస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండటంపై అభ్యంతరం చెపుతూ రెండేళ్ళ క్రితం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు తక్షణం వాటి నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశించడమే కాకుండా, తమ ఆదేశాలని ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగించినందుకు 8 మంది ఐఏఎస్ అధికారులకి నెలరోజులు జైలుశిక్ష, జరిమానా కూడా విధించింది. అప్పుడు వారు హైకోర్టుకి క్షమాపణలు చెప్పుకొని జైలుశిక్ష నుంచి తప్పించుకొన్నారు. కానీ ఆ తర్వాత కూడా పాఠశాల ఆవరణాలలో నిర్మాణాలు కొనసాగుతూనే ఉండటంతో మళ్ళీ 2021లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
అప్పుడు హైకోర్టు మళ్ళీ అధికారులని పిలిపించి గట్టిగా మందలించడమే కాకుండా ఆ నిర్మాణాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.40 కోట్లు వారి నుంచే రాబడతామని గట్టిగా హెచ్చరించింది. ఆ సమయంలోనే కొత్తగా సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డిని కూడా కోర్టుకి పిలిపించి హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణపై సంజయిషీ కోరింది. శుక్రవారం జరిగిన తదుపరి విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది సుమన్ హాజరై వివరణ ఇచ్చి అఫిడవిట్ సమర్పించారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన వివరణపై హైకోర్టు వేసిన ఎదురుప్రశ్న ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయలా మారింది.
పాఠశాల ఆవరణలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం తప్పేనని, అవన్నీ అక్రమ కట్టడాలుగానే అంగీకరిస్తున్నామని న్యాయవాది సుమన్ చెప్పారు. అయితే అవి అక్రమ కట్టడాలైనప్పటికీ వాటిని ప్రజాధనంతో నిర్మించినందున వాటిని కూల్చివేస్తే విలువైన ప్రజాధనం వృదా చేసిన్నట్లవుతుందని అన్నారు. కనుక వాటిని అవే పాఠశాలలకి అప్పగించి విద్యావసరాలకి మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్మించిందని సుమన్ హైకోర్టుకి తెలిపారు.
సరిగ్గా ఇక్కడే వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకి అడ్డంగా దొరికిపోయిందని చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఇచ్చిన ఈ వివరణపై హైకోర్టు స్పందిస్తూ, “అక్రమ కట్టడాలైనప్పటికీ ప్రజాధనం వృధా కాకూడదనుకొంటునప్పుడు, ఆనాడు ప్రజావేదికని ఎందుకు కూల్చివేశారు? దానినీ ప్రజాధనంతోనే కదా నిర్మించారు?గ్రామసచివాలయాల పట్ల ఓ రకమైన వైఖరి, ప్రజావేదిక కూల్చివేత పట్ల మరో రకమైన వైఖరి ఎందుకు?” అంటూ ఎదురు ప్రశ్నించేసరికి న్యాయవాది సుమన్ సమాధానం చెప్పుకోవడానికి తడబడ్డారు. తేరుకొని “అప్పటి పరిస్థితులు వేరు… ఇప్పటి పరిస్థితులు వేరు. అయినా ప్రజావేదిక వ్యవహారం హైకోర్టులో ఇంకా పెండింగులో ఉందని..” జవాబిచ్చారు. “అంటే ప్రజావేదిక కూల్చివేత గురించి మేము ప్రశ్నించకూడదా?” అని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఎదురు ప్రశ్నించారు.
ఈ కేసు తదుపరి విచారణని జనవరి 24కి వాయిదా వేస్తూ, పాఠశాల ఆవరణాలలో ప్రభుత్వమే నిర్మించిన అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ని కోర్టు సహాయకులుగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది కేఎస్.మూర్తికి ఇవ్వాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశించారు. అప్పుడు ప్రజావేదికని కూల్చివేసి జబ్బలు చరుచుకొని నీతులు చెప్పి, తర్వాత అదే తప్పు చేసి ఇప్పుడు హైకోర్టుకి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలీని పరిస్థితి!!!