Highcourt Opposes Andhra Pradesh Chief Ministerఅధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు అనేక సందర్భాలలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు అక్షింతలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమా టికెట్ ధరల సందర్భంలో కూడా రెండు సార్లు ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టగా, తాజాగా జీవో నెంబర్ 53, 54 లను రద్దు చేస్తూ కీలక తీర్పును వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ మరియు జూనియర్ కళాశాలల ఫీజులను నిర్ణయిస్తూ జగన్ సర్కార్ గతంలో జీవో నెంబర్ 53, 54 లను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన పిదప ఈ రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది.

ప్రైవేట్ స్కూల్స్ మరియు జూనియర్ కళాశాలల ఫీజులు మీరెలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన హైకోర్టు, చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా జీవోలు తీసుకువచ్చారని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్ మరియు జూనియర్ కాలేజీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే వాటికి సంబంధించిన ఫీజులను ఖరారు చేయాలని ఆదేశించింది.

వారంలో ఏదొక రోజు ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు పెదవి విరవడం లేక అంక్షింతలు వేయడం అనేది దేనికి సంకేతాలు? అనుభవ రాహిత్య పరిపాలనకు నిదర్శనమా? రాష్ట్ర సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందా? చట్టాల గురించి సరిగా అవపోశనం చేసుకోకపోవడమా? ఇలాంటి విధానంతో పరిపాలనపై ప్రజలలో చులకన భావన ఏర్పడుతోందని మాత్రం గమనించుకోవాలి.