Andhra-Pradesh-High Court-Nimmagadda Ramesh Kumarఏపీ సర్కారుకు మొట్టమొదటి సారిగా హైకోర్టులో ఒక పెద్ద కేసులో అనుకూల తీర్పు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేసింది. దీనితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళకూడదు అనే ప్రభుత్వ పంతమే చివరిగా గెలిచినట్టు అయ్యింది.

వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని, అందువల్లే ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఏకకాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ కష్టమని ప్రభుత్వం వాదించింది.

ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో ప్రభుత్వం పట్టు గెలిచినట్టు అయ్యింది. అయితే హైకోర్టు తాజా తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏపీ హై కోర్టులో ప్రభుత్వానికి గతంలో అనేక వ్యతిరేక తీర్పులు వచ్చాయి.

చంద్రబాబు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందని, న్యాయవ్యవస్థని ఆయన ప్రభావితం చేస్తున్నారని జగన్ ప్రభుత్వం గట్టిగా విశ్వసించింది. కేంద్ర ప్రభుత్వం మీద, సుప్రీం కోర్టు మీద ఒత్తిడి తెచ్చి ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా మార్పించింది. ప్రధాన న్యాయమూర్తి మార్పు జరిగిన వెంటనే ప్రభుత్వానికి ఒక పెద్ద కేసులో అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం.