Andhra Pradesh High Courtఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులు ఎత్తేయాలని ప్రభుత్వం పిటిషన్‌‌లో పేర్కొంది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది.

ఈ విషయంలో కనీసం నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చెయ్యాలని హైకోర్టుని ఆదేశించామని ప్రభుత్వం సుప్రీం కోర్టుని కోరింది. అయితే అందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం ఒప్పుకోలేదు. సాధ్యమైనంత త్వరగా కేసును విచారించాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. ఈ రెండు విషయాలను పరిశీలిస్తే హై కోర్టు మీద జగన్ ప్రభుత్వానికి పూర్తిగా నమ్మకం పోయిందా? అనిపించకమానదు.

మొదటి నుండీ కూడా హైకోర్టులోని జడ్జీలు చంద్రబాబు నాయుడు కన్నుసన్నలలో పని చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ వారి అభిప్రాయం. అందుకే హైకోర్టుని బై పాస్ చేసి ఈ విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని చూసింది అయితే అది సాధ్యం కాలేదు. కనీసం విచారణ పూర్తి చెయ్యడానికి గడువు పెడితే తదుపరి కార్యాచరణ ప్రారంభించొచ్చు అనుకుంది ప్రభుత్వం.

అది కూడా సాధ్యపడలేదు. అయితే హైకోర్టు మీద తమకు నమ్మకం లేదంటూ పదే పదే ప్రభుత్వం మెస్సేజ్ పంపడం వల్ల భవిష్యత్తులో తీర్పులు తమకు మరింత వ్యతిరేకంగా వస్తాయేమో అని వైఎస్సార్ కాంగ్రెస్ వారు ఆందోళన చెందుతున్నారు. చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందని!