Why Andhra Pradesh High Court issued Notices to 49 YSRCP Social Media Activistsన్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పై సీరియసైంది ఏపీ హైకోర్టు. న్యాయమూర్తుల పై వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కోర్టు 49 మందికి నోటీసులిచ్చింది. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్,మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించిన హైకోర్టు వారికి కూడా నోటీసులు జారీ చేసింది.

అయితే నాయకులను పక్కన పెడితే.. లిస్టులో ఉన్న మిగతా వారందరూ ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే. కోర్టులతో వ్యవహారం కావడంతో అధికార పక్ష నాయకులు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. ఎక్కడ ఏం మాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుందో అని వారి ఆందోళన. ఈ క్రమంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఒక ఆసక్తికరమైన చర్చ తెర మీదకు తెచ్చారు.

“ఎవరైతే ఈ లిస్టులో ఉన్నారో… ఇంకా ఎవరైతే లిస్టులో యాడ్ అవుతారో… వారిలో 95-98% మంది నిరక్షరాస్యులు గానీ, విషయ పరిజ్ఞానం లేని వారు గానీ, మీడియాలో ఏం రాయాలో ఏం మాట్లాడాలో తెలియని వారు… అనుకున్నది అంతా రాసేస్తే అయిపోతాది అనుకునే వారే,” అంటూ వారిని సమర్ధించుకొచ్చారు.

తమ వారు కాబట్టి శ్రీధర్ ఏదో విధంగా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదే ప్రభుత్వం టీడీపీ సోషల్ మీడియా వర్కర్స్ మీద కేసులు పెట్టి జైళ్ళ లో పెడుతున్నారు. కనీసం విమర్శ చేసినా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అప్పుడు వారికి మినహాయింపులు ఉండవా? లేదా అధికార పక్షం వారికే ఇటువంటి వెసులుబాట్లా?