Andhra-Pradesh-Grama-Panchayat-Funds misuseదేశంలో పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనుల కొరకు నేరుగా వాటికే నిధులు విడుదల చేస్తుంటుంది. కానీ నిధుల కొరతతో సతమతమవుతున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన రూ.1244 కోట్లు పక్కదారి పట్టించేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆయా పంచాయతీల పేరిట బ్యాంక్ అకౌంట్లు తెరిపించింది.

ఇక నుంచి వాటిలోనే జమా చేయాలని నిర్ణయించి త్వరలోనే ఏపీలో పంచాయతీలకు రూ.379 కోట్లు జమా చేయబోతోంది. ఈ నిధులను ఆయా పంచాయతీలలో అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించాలని, వేరే అవసరాలకు మళ్ళించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఆదేశం జారీ చేసింది.

కానీ వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఆదేశాన్ని పట్టించుకోకుండా త్వరలో విడుదలయ్యే రూ.379 కోట్లు పంచాయతీల విద్యుత్‌ బకాయిలుగా జమా చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతున్నారు.

ఈ మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇచ్చి సమస్యలను పరిష్కరించకపోగా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా బలవంతంగా గుంజుకొంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. గ్రామాలలో సచివాలయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? గ్రామంలో రోడ్లు, కాలువలు, వీధి దీపాలు వంటి మౌలికసదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో గ్రామాలలో అన్ని సమస్యలు తీరకపోయినా కనీసం రోడ్లు, కాలువలు వంటి ప్రధాన సమస్యలు తీరుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆ కొద్దిపాటి సొమ్మును కూడా విద్యుత్‌ బకాయిల కింద జమా చేసుకొంటే గ్రామాల పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని సర్పంచ్‌లు, గ్రామస్తులు చెపుతున్నారు.

ఓ పక్క ఎడాపెడా అప్పులు చేస్తూ, మరోపక్క రాజధాని భూములు అమ్ముకొంటూ, ఆర్టీసీ ఆదాయంలో 25 శాతం పిండుకొంటున్నా ఇంకా సరిపోవడం లేదు. పంచాయతీ నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం ఈవిదంగా పక్కదారి పట్టిస్తుండటం చాలా శోచనీయం.