Film Theaters To Shutdown in Keralaతెలంగాణలో ఇప్పటికే మూడు రోజుల నుండి సినిమా హాల్స్ బంద్ చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు సినిమా థియేటర్లు మూసి ఉంటాయని ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు కరోనా వైరస్ ప్రభావంతో సినిమా థియేటర్లను మూసి వేసాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి ప్రభుత్వం తమకు కరోనా ఎఫెక్ట్ లేదని వాదిస్తుంది. దీనిలో భాగంగా సినిమా హాల్స్ గానీ, స్కూళ్లకు గానీ సెలవులు ప్రకటించలేదు. అయితే రాష్ట్రంలోని ఒకే కరోనా కేసు నమోదైన నెల్లూరు జిల్లాలో మాత్రం అక్కడి జిల్లా కలెక్టర్ సినిమా హాల్స్ బంద్ చెయ్యాలని హుకుం జారీ చేశారు.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ & ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్వచ్ఛందంగా థియేటర్లు మూసి వెయ్యాలని నిర్ణయించుకుంది. రేపటి నుండి ఈ నెల 31వరకు జిల్లాలోని అన్ని సినిమా థియేటర్స్ బంద్ అవుతాయని ప్రకటించింది. కొత్త సినిమాలు రిలీజ్ లేకపోవడం పాత వాటికి ఆడియన్స్ లేకపోవడంతో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు భావించవచ్చు.

ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక్క కరోనా వైరస్ కేసు మాత్రం నమోదు అయ్యింది. అదే విధంగా తెలంగాణాలో ఆరు నమోదు అయ్యాయి. ఈ వైరస్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లు కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే.