గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడం ఆనవాయితీ. గవర్నర్ ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తయారుచేసి పంపిస్తుంది. నేడు ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు అలాగే ప్రారంభం అయ్యాయి. కనుక గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో వైసీపీ పాలన నభూతో నభవిష్యత్ అన్నట్లు మహాద్భుతంగా ఉందని సర్టిఫై చేసేశారు. అయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన ఆయనకు ఏపీ ప్రభుత్వం తీరు, ఏపీలో పరిస్థితుల గురించి తెలియవనుకోలేము. కానీ రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ తన భాద్యతని సక్రమంగా నిర్వర్తించారు అంతే అనుకోవాలి.
రాష్ట్రం సుభిక్షంగా ఉందని గవర్నర్ చేత శాసనసభలో చెప్పించినంత మాత్రన్న సుభిక్షంగా ఉందని రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలు, బకాయిలను రాబట్టుకోవడానికి ఉద్యమించడానికి సిద్దమయిన సంగతి, వారిలో కొందరు మాజీ గవర్నర్‌ని కలిసి తమ గోడు మొరపెట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే.
మూడు రాజధానుల పేరుతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలే మూడు ప్రాంతాల ప్రజల మద్య విద్వేషాలు రాజేసేందుకు వెనకాడటం లేదు. వైసీపీలో సీనియర్ మంత్రి ధర్మాన మరో అడుగు ముందుకు వేసి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాకపోవడం వలన నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతూనే ఉంది. నిత్యం వేలాదిమంది నిరుద్యోగ యువత ఇరుగు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతూనే ఉన్నారు.
అయితే నైవేధ్యం లేక నీరసించిపోయాను కానీ నైవేధ్యం పెట్టు నా మహిమా చూపిస్తానాన్ననట్లు ‘రాజధాని రానీయండి అభివృద్ధి చేసి చూపిస్తామని’ ఒక మంత్రి, ‘రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయి కనుక 6 లక్షల మంది ఉద్యోగాలకు దరఖాస్తులు సిద్దం చేసుకోండని’ మరో మంత్రి చెపుతుంటారు.
కానీ ఈ రాజధానూలు, 384 పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు అన్నీ ఎప్పుడు వస్తాయో మంత్రులు, ఎమ్మెల్యేలకి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ప్రజలు తమకు ఇచ్చిన 5 ఏళ్ళ పుణ్యకాలం దాదాపు పూర్తయిపోతోంది. మళ్ళీ అధికారంలోకి వస్తారోరారో వారికీ తెలియదు కనుక.
అందుకే వారి హామీలన్నీ భవిష్యత్‌తోనే ముడిపడి ఉంటాయి తప్ప ఏవీ వర్తమానంలో ఉండవు. ఇవన్నీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలియవనుకోలేము. కానీ ‘ఏపీ ఆల్ ఈజ్ వెల్’ పాట పాడేసి తన ధర్మం నిర్వర్తించారు. కానీ ఒక్క విషయం… సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి వచ్చిన ఆయన చేత కూడా వైసీపీ ప్రభుత్వం ఇన్ని అబద్దాలు చెప్పించడం విశేషమే కదా? అంతమాత్రన్న అబద్దాలు నిజమైపోవు కదా?