గతంలో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ విషయంలో అనేక వివాదాలు చెలరేగేవి. ఆయన తరచుగా దేవాలయాలు సందర్శించడం, అక్కడ ఆయన కోసం ప్రోటోకాల్ పాటించడం, దానివల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలగడం వంటివి తరచుగా జరిగేవి. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అటువంటి ఆర్భాటాలకు దూరంగా ఉండటం గమనార్హం.

గవర్నర్‌ అంటే రాజ్యాంగపరమైన హోదా. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. ఎక్కడకెళ్లినా ఆయనకు రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే తనకు అటువంటి ఆడంబరాలు, బ్రిటిష్‌ కాలంనాటి సంప్రదాయాలు వద్దని, అనవసర ఖర్చులకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటీవల శ్రీశైలం పర్యటన సందర్భంగా గవర్నర్‌ ఈ మేరకు చెప్పారు

సాధారణంగా గవర్నర్‌ ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌లో పర్యటనలకు వెళ్తారు. విమానం దిగినప్పటి నుంచి కారు వద్దకు వెళ్లే వరకు ఎర్రతివాచీ పరిచి అధికారులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అయితే అలాంటి పద్ధతులు పాటించాల్సిన పనిలేదని గవర్నర్‌ చెప్పారు. గతంలో కూడా ఆయన ప్రత్యేక విమానంలో తిరుమలకు వెళ్లేందుకు అవకాశమున్నా.. సాధారణ విమానంలోనే వెళ్లారు

అలాగే తనను వివిధ సందర్భాలలో కలిసేందుకు వచ్చేవారు కేవలం మొక్కలు మాత్రమే తెచ్చేలా చూస్తున్నారు. ఆ మొక్కలను రాజ్ భవన్ ప్రాంగణంలో నటిస్తున్నారు. అలాగే కొన్ని ఉద్యోగులకు ఇచ్చి పలు చోట్ల నాటేలా చూస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆచరణలో చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.