Andhra Pradesh Governor - Amaravati - YS Jaganఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపించిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, రాజధాని సంస్థ రద్దు బిల్లులపై ఎటువంటి నిర్ణయం వస్తుందని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సమయంలో బిల్లులపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ న్యాయ సలహా కోరినట్లు మీడియాలో వార్తలు సూచిస్తున్నాయి.

ఈ చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఈ చట్టాలు తన వద్దకు పంపే విషయంలో రాజ్యాంగపరమైన పద్ధతులు పాటించారా? ఈ బిల్లులలోని అంశాల ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైన అంశం ఏదైనా ఉందా? అన్న అంశాలపై సలహా ఇవ్వాలని ఆయన కోరారని చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన ఆమోదం కోసం పంపించిన మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను సోమవారం ఆయన ప్రభుత్వ న్యాయ విభాగానికి పంపించారు. ఈ రెండు బిల్లులపై తదుపరి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా న్యాయ సలహా ఇవ్వాలని కోరారు. ఒకవేళ న్యాయ సలహా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి బిల్లులకు గవర్నర్ ఆమోదం పొందితే ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకున్నట్టే.

ఆ తరువాత ఆ బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తాయి. గవర్నర్ గనుక ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే కావొచ్చు. విజయదశమి సమయానికి విశాఖకు రాజధాని తరలింపు పూర్తి చెయ్యాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అటువంటి పరిస్థితులలో అమరావతిలో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది.