YS Jagan Government- Trying to Stall Select Committee--అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్దీఏ రద్దు బిల్లులను సెలెక్టు కమిటికి వెళ్లనివ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. బిల్లులను సెలక్టు కమిటీకి ఎలా పంపుతారని శాసనమండలి ఛైర్మన్ , అసెంబ్లీ కార్యదర్శులను ఆ పార్టీ ప్రశ్నించింది.

ఈ మేరకు వారిద్దరికీ శాసనసమండలిలో సభానాయకుడు.. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వేర్వేరుగా లేఖలు పంపారు. బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలంటే సభలో ఓటింగ్ నిర్వహించాలి. కానీ అలా చేయలేదు. సభ ఆమోదం పొందాక కావాలంటే సెలక్టు కమిటీకి పంపండి అని వారు లేఖల్లో కోరినట్లు తెలిసింది.

సెలక్టు కమిటీని ఏర్పాటు చేయడానికి సభలోని అన్ని పక్షాల ప్రతినిధుల పేర్లను కోరుతూ లేఖలు పంపాలని మండలి ఛైర్మన్ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ ఆదేశం మేరకు సోమవారంలోగా అన్ని పక్షాల ప్రతినిధుల పేర్లను సేకరించాల్సి ఉందని సమాచారం.

వైఎస్సార్ కాంగ్రెస్ తమ సభ్యుల జాబితా ఇవ్వకపోతే ఈ ప్రక్రియపై ఛైర్మన్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఐదుగురు చొప్పున సభ్యులను ప్రతిపాదిస్తూ కార్యదర్శికి టీడీపీ పేర్లు పంపింది. పీడీఎఫ్‌ కూడా కేఎస్‌ లక్ష్మణరావును వికేంద్రీకరణ బిల్లుకు, ఐ.వెంకటేశ్వరరావును సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు సూచించనుంది. బీజేపీ కూడా తనకున్న ఇద్దరు సభ్యుల పేర్లను (సోము వీర్రాజు, మాధవ్‌) సూచించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.