sakshi-buildingఇప్పటికే దాదాపు 2000 కోట్ల విలువైన జగన్ కు సంబంధించిన అక్రమాస్తులను ఎం ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకుంది. ఈ మొత్తం విలువైన ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినవి కావడంతో త్వరలోనే వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ జాబితాలో జగతి పబ్లికేషన్స్ తో పాటు, సాక్షి పత్రిక యాజమాన్య సంస్థ అయిన జననీ ఇన్ ఫ్రాలు కూడా ఉండడంతో, త్వరలోనే సాక్షి దినపత్రిక, మీడియా ఛానల్ ఏపీ ప్రభుత్వ పరం అవుతాయని తెలుస్తోంది.

ఇందుకోసం ఏపీ స్పెషల్ కోర్టుల చట్టం 2015ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.., ఇప్పటికే కేంద్ర హోం, న్యాయ శాఖలు ఆమోదం తెలిపాయి. ఇక రాష్ట్రపతి ఓకే అంటే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఇదే జరిగితే, జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ముగించేందుకు కొంత సమయం ఇచ్చి, ఆపై ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. “ఈడీ ఎటాచ్ మెంటులో ఉన్న ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ వేగవంతం చేసి సత్వర న్యాయానికి కృషి చేస్తాం” అంటూ యనమల వ్యాఖ్యానించారు.

దీంతో జగన్ కు తీవ్ర భంగపాటు తప్పదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ యజమానిగా ఉన్నటువంటి ఇండియా సిమెంట్స్, రాంకీ, భారతీ సిమెంట్స్, క్యారమిల్ ఆసియా హోల్డింగ్స్, లేపాక్షీ నాలెడ్జ్ హబ్, ఇందూ ప్రాజెక్ట్స్ వంటి మరికొన్ని సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.