Andhra-Pradesh-Government-Teachers-Transferఅమరావతి, పోలవరం మొదలు టీచర్ల బదిలీల వరకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మార్గదర్శకాలు జారీ చేసింది. దాని ప్రకారం ఈ నెల 12 నుంచి వచ్చే నెల 12 లోగా బదిలీల ప్రక్రియ ముగించాలని ఉత్తర్వులలో పేర్కొంది. జెడ్పీ, ఎంపీపీ, పాఠశాలలో గ్రేడ్-2 హెడ్ మాస్టర్ల బదిలీలకి కనీసం 5 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసి ఉండాలని పేర్కొంది. కానీ ఉపాద్యాయుల బడిల్లీలకి సర్వీసుతో సంబందం లేదని ఉత్తర్వులలో పేర్కొంది. బదిలీల కోసం హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని, వారికి వెబ్‌ కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపడతామని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ బదిలీల ప్రక్రియ వలన తరగతులకి ఎటువంటి ఇబ్బందీ ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో కొన్ని పాఠశాలని విలీనం చేయడంతో ప్రాధమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కనుక 3వ తరగతి నుంచి 10వ తరగతుల బోధనకి అత్యవసరంగా 7,928 సబ్జెక్ట్ టీచర్లు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటికిప్పుడు కొత్తగా ఉపాద్యాయులను భర్తీ చేయడం సాధ్యం కాదు కనుక ఇలా విద్యాసంవత్సరం మద్యలో హడావుడిగా ఉపాధ్యాయులని బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాధారణంగా పాఠశాలలకి వేసవి సెలవులిచ్చినప్పుడు ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతుంటాయి. అప్పుడైతే తరగతులు ఉండవు కనుక చదువులకి ఎటువంటి ఆటంకం ఏర్పడదు. అదీగాక ఒక చోట నుంచి మరోచోటికి ఉపాధ్యాయులు బదిలీ అయినప్పుడు కొత్త ప్రాంతంలో ఇల్లు వెతుక్కొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని స్థిరపడేందుకు వారికీ తగినంత సమయం లభిస్తుంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచేసరికి బదిలీలపై వచ్చిన ఉపాధ్యాయులు అందరూ పాఠాలు భోదించేందుకు సిద్దంగా ఉంటారు. కానీ ఇలా అర్దాంతరంగా వార్షిక పరీక్షలకి రెండుమూడు నెలల ముందు ఉపాధ్యాయులని బదిలీ చేయడంతో ఈ ప్రభావం తప్పకుండా విద్యాబోధన మీద, పరీక్షా ఫలితాల మీద కూడా పడుతుంది.