YS-Jagan-Government-Loansప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు జీతాల కోసం ఎదురుచూస్తున్న వార్తలు ఇదివరకు నిత్యం వచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి వారికంటే దారుణంగా మారింది. ప్రతీనెల 1వ తేదీ వస్తోందంటే జీతాలు వస్తాయని సంతోషపడే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

ప్రతీనెల జీతాల కోసం రోడ్లపై ధర్నాలు చేయవలసిరావడం తమకి చాలా అవమానకరంగా ఉందని ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. కనుక ఒకటో తారీకు వస్తోందంటే ఆర్ధికశాఖ ఉన్నతాధికారులకి కూడా ఆందోళన తప్పడం లేదు. ప్రతీనెల 15వ తేదీకి జీతాలు చెల్లించేయగానే మళ్ళీ వచ్చే నెల జీతాల చెల్లింపు కోసం నిధులు ఎలా సమకూర్చుకోవాలి? కుదరకపోతే ఎక్కడి నుంచి ఏవిదంగా అప్పు తెచ్చుకొని జీతాలకి సర్దుబాటు చేయాలి?అని ప్రతీనెల అధికారులు తలలు పట్టుకొని పరుగులు తీయాల్సివస్తోంది.

ఈ నెల పెద్ద పండగగా చెప్పుకొనే సంక్రాంతి పండుగ కూడా ఉంది. కానీ నేటికీ 50 శాతం మందికి జీతాలు పడలేదని సమాచారం. ఇటీవల సిఎం జగన్‌ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిసి వచ్చారు. అంతకు ముందు నుంచే రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖ చుట్టూ తిరిగి రాబోయే మూడు నెలల కాలానికి రూ.4,557 కోట్లు అప్పులు చేసుకోవడానికి అనుమతులు తెచ్చుకొన్నారు. కానీ శుక్రవారం రాత్రి 7.30 గంటల వరకు కేంద్రం దీనికి సంబందించి నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడంతో రాష్ట్ర ఆర్ధికశాఖ అధికారులలో ఆందోళన మొదలైంది.

ఎందుకంటే ప్రతీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంపాటలో పాల్గొనాలంటే కేంద్రం అనుమతి అవసరం. దాని కోసం ప్రతీ శుక్రవారం సాయంత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంటుంది. అయితే నిన్న కాస్త ఆలస్యమైనప్పటికీ నోటిఫికేషన్‌ వచ్చింది. దానిలో ఏపీ ప్రభుత్వం రూ.2,000 కోట్లు అప్పు తీసుకొనేందుకు అనుమతి కూడా ఇచ్చిన్నట్లు చూశాక అధికారులు ఊపిరి తీసుకొన్నారు.

మంగళవారం జరిగే సెక్యూరిటీ బాండ్ల వేలంపాటలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు అప్పు లభిస్తుంది. అది జనవరి 11 నాటికి ప్రభుత్వం చేతికి అందే అవకాశం ఉంది. కనుక ఈసారి సంక్రాంతి పండుగలోగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చెల్లించే అవకాశం ఉంది. కనుక ఈసారి ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు కూడా పండుగ చేసుకోవచ్చు.