ys-jagan-old-age-Pensionఈరోజు అమరావతి, సచివాలయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెన్షన్‌ మొత్తాన్ని నెలకి రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచాలనే ప్రతిపాదనకి ఆమోదముద్ర వేసింది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ అమలులోకి రానుంది. దీని ద్వారా రాష్ట్రంలో 62.31 లక్షల మంది పెన్షనర్లకి లబ్ది కలుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. ఇది కాక వైఎస్సార్ పశుభీమా పధకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు విద్యారంగానికి చెందిన మరికొన్ని ప్రతిపాదనలకి ఆమోదం తెలిపింది.

పెన్షన్ పెంపు వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగమే కనుక ఏటా రూ.250 చొప్పున పెంచుతోంది. ఆ ప్రకారం ఈ సంవత్సరంలో మరో రూ.250 పెంచింది. ఇది వాటిపై ఆధారపడిన వారికి ఎంతో సంతోషం కలిగించేదే. కనుక దీంతో రాష్ట్రంలో 62.31 లక్షల పెన్షనర్ల ఓటు బ్యాంక్‌ని వైసీపీ పదిలంగా కాపాడుకొన్నట్లే భావించవచ్చు. వారితో పాటు వివిద సంక్షేమ పధకాల లబ్దిదారులు కూడా ఉంటారు. వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. ఒక ఇంట్లో పెన్షన్ లేదా సంక్షేమ పధకం అందితే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ వైసీపీకే మొగ్గు చూపడం సహజం. కనుక వైసీపీ చాలా దూరదృష్టితో తన ఓటు బ్యాంకుని బలంగా నిర్మించుకొని కాపాడుకొంటున్నట్లు భావించవచ్చు.

అయితే వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీలోకి అధికారంలోకి వచ్చినందున రాష్ట్రాభివృద్ధిపై కూడా దృష్టిపెట్టి రాజధాని, పోలవరం పనులు వేగవంతం చేసి, రాష్ట్రానికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను రప్పించి ఉద్యోగ కల్పన చేసి ఉండి ఉంటే వైసీపీని రాష్ట్ర ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజించేవారు. అప్పుడు వైసీపీ అడగకుండానే రాబోయే ఎన్నికలలో 175 సీట్లు ఇచ్చి ఉండేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు నిర్మించుకోవడంపై చూపిన శ్రద్ద రాష్ట్రాభివృద్ధిపై చూపకపోగా, మూడున్నరేళ్ళలో కక్ష సాధింపు రాజకీయాలతో కాలక్షేపం చేసేసింది. ఇక మిగిలిన ఏడాదిన్నర కాలం కూడా అలాగే కాలక్షేపం చేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

కనుకనే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఆ రెండు పార్టీల అధినేతల జిల్లా పర్యటనలకి వస్తున్న అపూర్వ ప్రజాస్పందనే ఇందుకు నిదర్శనం. ఆ వ్యతిరేకతని టిడిపి, జనసేనలు తమకి అనుకూలంగా ఉపయోగించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది వైసీపీ స్వయంకృతమే అయినప్పటికీ గుర్తించి లోపాలు సరిదిద్దుకోకుండా అహంభావంతో నిరంకుశత్వంగా వాటిని అణచివేయాలని ప్రయత్నిస్తుండటంతో, సంక్షేమ పధకాలు, పెన్షన్లు పొందుతున్నవారి సంఖ్య కంటే ప్రభుత్వ వ్యతిరేకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

యధారాజా తధాప్రజా అన్నట్లు మిగిలిన ఈ ఏడాదిన్నర కాలంలో వైసీపీ ప్రభుత్వం తీరుని బట్టే ప్రజలలో అనుకూలత, వ్యతిరేకత అదే నిష్పత్తిలో పెరుగుతుంటాయి. కనుక ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పాలన సాగిస్తూ అనుకూలతని పెంచుకోవాలా లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలతో 175 సీట్లు గెలుచుకోవచ్చనే గుడ్డి ధీమాతో అహంభావంగా ప్రవర్తిస్తూ ప్రజలలో వ్యతిరేకత పెంచుకోవాలా అనేది వైసీపీ చేతిలోనే ఉంది. ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ గట్టిగా కోరుకొంటున్నట్లయితే దాని తీరు సమూలంగా మార్చుకోక తప్పదు. లేకుంటే ఇదే చివరి ఛాన్స్ కావచ్చు.