Anandayya Medicineకోవిడ్ విరుగుడు అంటూ కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే కంట్లో వేసే మందుపై పూర్తి స్థాయి నివేదికలు రావడానికి ఇంకా 2–3 వారాల సమయం పడుతుందని… ఆ కారణంగా అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ‘కె’ అనే మందును కమిటీ ముందు చూపించకపోవడంతో దానికి కూడా అనుమతి నిరాకరించింది.

ఈ రెండిటికీ కాకుండా ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందులకు (పీ,ఎల్, ఎఫ్) ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే… ఈ మందుల వల్ల కోవిడ్ త‌గ్గుతుంద‌న‌డానికి నిర్ధార‌ణ లేద‌ని నివేదికలు ఇవ్వడం గమనార్హం. అయితే వీటివల్ల హానీ లేదు అని మాత్రం చెప్పాయి. కోవిడ్ తగ్గకపోతే ఆ మందులు ఎందుకు ఇస్తున్నట్టు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.

ఆ ముందుకు ఒక సెక్షన్ అఫ్ మీడియా, అలాగే అధికార పార్టీ నేతలు విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చి ప్రజలలోకి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు కేవలం ప్రజల సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రభుత్వం ఈ మందులకు అనుమతినిచ్చింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులను ఆపొద్దని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

అలాగే మందును తీసుకోవడానికి కొవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ సూచనలను ప్రజలు పాటిస్తే పర్లేదు…. ఏదైనా తేడా జరిగితే మాత్రం ఈ మందులు ఇచ్చే స్థలాలు కోవిడ్ క్లస్టర్లుగా మారే ప్రమాదం ఉంది.