Bandi-Srinivasa-Rao Ap Govt GPS Systemసర్కారువారి పాటతో త్వరలో మహేష్ బాబు వస్తున్నాడు. కానీ అంతకంటే ముందు ఏపీ సర్కార్ వారి పాట కూడా వచ్చేసింది. అదే జీపీస్! అయితే అది రిలీజ్ కాకమునుపే ఉద్యోగ సంఘాలు దానిని తిరస్కరించడంతో ప్లాప్ అయ్యింది. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలుచేయాలంటూ నిన్న తాడేపల్లిలోని సిఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించానికి ఉద్యోగులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఉద్యోగ సంఘాల ఒత్తిడికి తలొగ్గి సీపీఎస్‌ను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్దపడినట్లుగా ముగ్గురు మంత్రులు,ముగ్గురు సభ్యులతో వెంటనే ఓ కమిటీ వేసింది. కానీ ఇదివరకు వేసిన కమిటీలు ఇచ్చిన నివేదికలకే దిక్కు లేదు ఇప్పుడు కొత్తగా మరొకటి ఎందుకని వారు నిలదీశారు. ఇది కేవలం తమను మభ్యపెట్టడానికేనని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, “మేము సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరుతుంటే ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీస్) అంటూ కొత్త ప్రతిపాదన చేయడం, దానిని బలవంతంగా మాపై రుద్దాలని ప్రయత్నిస్తుండటం సరికాదు. జీపీఎస్‌పై మాకు చాలా అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయి. కనుక మేము దానిని అంగీకరించము,” అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల మేలు కోరే వ్యక్తి అని కానీ ఉద్యోగ సంఘాలలో కొందరు రాజకీయ ప్రేరిత నేతలు లేని సమస్యను సృష్టించి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారని వైసీపీ మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి నిజంగా ఉద్యోగుల మేలు కోరే వ్యక్తి అయితే వారు కోరుతున్నట్లుగానే చేయవచ్చు కదా?ఉద్యోగుల నెత్తిన జీపీఎస్ పెట్టడం దేనికి?