Andhra Pradesh Government Employees angry on Jaganఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే… ఏదైనా తప్పు చేస్తే విద్యార్థులను శిక్షించి సన్మార్గంలో పెట్టి, వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, నేడు వారికి వారే శిక్షలు విధించుకుంటున్నారు. ఇదంతా జగన్ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన పీఆర్సీ తదుపరి జరుగుతోన్న సంఘటనలు.

పీఆర్సీ ద్వారా జీతాలు పెరగకపోగా, అంతకుముందు వచ్చే జీతాలను కూడా తగ్గించి రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా చూసుకోవడంలో విజయవంతం అయిన జగన్ సర్కార్ ను అధికారంలోకి తెచ్చి, తాము తప్పు చేశామని ఉపాధ్యాయులు ఒంటి కాలుపై నిల్చొని లెంపలేసుకుని తమకు తామే శిక్షించుకున్నారు. ఇది కూడా జగన్ సొంత ఇలాకాలో చోటు చేసుకోవడం విశేషం.

సీఎం సొంత అడ్డా అయిన కడప జిల్లా బద్వేల్ లో పని చేస్తోన్న ఉపాధ్యాయులు స్వీయ శిక్ష ఫోటోలను ప్రముఖ ప్రింట్ మీడియా ప్రచురించగా, అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తోన్న నిరసనలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ముట్టడికి పిలుపునిచ్చారు.

అలాగే ప్రభుత్వం నుండి కూడా అదే స్థాయిలో ముందస్తు చర్యలను చేపట్టారు. ఆందోళనకారులు కలెక్టరేట్ల లోపలికి వెళ్లకుండా భారీగా పోలీసులను మోహరించి నిలువరించే ప్రయత్నం చేసారు. జగన్ ఇలాకా అయిన కడప జిల్లాలో అయితే కలెక్టరేట్ ముట్టడికి వెళ్లిన పలువురి నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే ప్రొద్దుటూరు నుండి వచ్చే ఉపాధ్యాయులను దారి మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో, రోడ్డు పైనే భైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు.