Bopparaju_Sreenivasulu_APJACఏపీ మంత్రులు తమ ప్రభుత్వం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులలో, ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందనే విషయం వారికీ తెలుసు. ఒకవేళ ఇంకా తెలియన్నట్లు నటించాలనుకొన్నా ఉద్యోగ సంఘాలు చేసిన తాజా హెచ్చరిక వాస్తవ పరిస్థితిని చూపిస్తోంది.

ఆదివారం విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్‌మీట్‌ పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, “మా జీతాలు, డీఏ బకాయిలు, పెన్షనర్ల సమస్యలన్నిటిపై చర్చించేందుకు ప్రభుత్వం ఫిభ్రవరి 5వ తేదీలోగా ఉద్యోగ సంఘాలని చర్చలకి ఆహ్వానించాలని కోరుతున్నాము. ఒకవేళ ఆలోగా ప్రభుత్వం స్పందించకపోతే ఆదేరోజున కర్నూలులో జరిగే మహాసభలలో మేము కార్యాచరణ ప్రకటిస్తాం. గత ఏడాది జనవరి 15న సిఎం జగన్‌తో మేము సమావేశమైనప్పుడు నాలుగు నెలల్లోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏడాది గడిచినా ప్రభుత్వం ఒక్క సమస్య కూడా తీర్చేలేదు. సిఎం జగన్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలుచేయలేదు. ముఖ్యమంత్రి హామీలే అమలు చేయలేకపోతే ఇక దిగువస్థాయి మంత్రులు, ఐఏఎస్‌లు, అధికారులు ఇచ్చే హామీలు ఎలా అమలవుతాయి?

జీతాల గురించి మేము అడిగితే ప్రతీనెలా ముగిసేలోగా ఇస్తూనే ఉన్నాము కదా?అంటూ అధికారులు మాట్లాడుతున్నారు. అందుకు వారు సిగ్గు పడుతున్నారో లేదో తెలీదు కానీ మేము చాలా సిగ్గు పడుతున్నాం. గతంలో ఏనాడూ ఇలా జరుగలేదు. టంచనుగా 1వ తేదీన లేదా ఇంకా ముందే జీతాలు చెల్లించేవారు.

పదకొండో పీఆర్సీలో 27% ఐఆర్ ఇచ్చి ఫిట్‌మెంట్ 23 శాతానికి తగ్గించారు. ఎప్పటికప్పుడు డీఏలు ఇచ్చే పద్దతి ప్రభుత్వం ఎప్పుడో వదిలేసింది. గత ఏడాదికి చెందిన మూడు డీఏలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. వాటినే ఇప్పుడు ఇచ్చి ఉద్యోగులని సర్దుకుపోవాలని చెపితే కుదరదు.

ఈసారి మేము ప్రభుత్వం ముందు నిర్ధిష్టమైన డిమాండ్స్‌ పెట్టబోతున్నాము. ప్రభుత్వం కూడా నిర్ధిష్టమైన కాలపరిమితితో వాటన్నిటినీ పరిషకరించారలని కోరుతున్నాము. మేమేమి ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ప్రతీనెల సకాలానికి జీతాలు ఇవ్వాలని, డీఏ బకాలు, వగైరా చెల్లించాలని మాత్రమే కోరుతున్నాము. ప్రభుత్వం స్పందించకుంటే ఫిభ్రవరి 5న కార్యాచరణ ప్రకటించి ఉద్యమించక తప్పదు,” అని అన్నారు.