AP Govt Decision on 26 Districts13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను 26 జిల్లాలుగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉద్యోగుల అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడంతో, దీనిని డైవర్ట్ చేయడానికే జిల్లాల పెంపును తెరపైకి తీసుకువచ్చారన్న ఆరోపణలను ప్రతిపక్షం వినిపిస్తోంది.

కొన్నాళ్ల పాటు సినిమా వాళ్ళ టికెట్ ధరలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మీడియాలలో హల్చల్ చేసిన మంత్రులు, నేడు ఉద్యోగస్తులను తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని, దానిని పక్కదారి పట్టించేందుకే ఈ ప్రకటన అని చెప్తున్నారు. అయితే అమలుకు మాత్రం ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని, తెలంగాణలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయానికే ఆమోద ముద్ర లభించలేదని గుర్తు చేస్తున్నారు.

అయితే ఈ జిల్లాల పెంపు ప్రకటన రాజకీయంగా ఎంత అలజడి సృష్టించినా, సోషల్ మీడియాలో మాత్రం అత్యంత కామెడీగా మారిపోయింది. అది కూడా ఇటీవల జగన్ సర్కార్ చేసిన ప్రకటన వల్లే! జిల్లాకో ఎయిర్ పోర్ట్ అంటూ జగన్ సర్కార్ ప్రకటించగా, ఇపుడు 26 విమానాశ్రయాలు ఏపీలో రానున్నాయంటూ సోషల్ మీడియాలో చేస్తోన్న మేమ్స్ కు కొదవలేదు.

దీంతో జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రకటన కాస్త సోషల్ మీడియాలో అత్యంత హాస్యాస్పదంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న జిల్లాలలోని ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న నేపధ్యంలో… పెంచిన 13 జిల్లాలకు ఉద్యోగస్తులకు జీతాలను ఎక్కడ నుండి తీసుకువస్తారనేది అర్ధం కాని అంశంగా మారింది. అందుకే ఇది ఓ డైవర్షన్ ప్రకటనగానే విమర్శలు వస్తున్నాయి.